వికారాబాద్/ఆదిబట్ల, నవంబర్ 5 : ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన నాలుగు డీఏలు, పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు ‘ధర్మాగ్రహ’ దీక్ష చేపట్టాయి. మంగళవారం టీపీయూఎస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్, వికారాబాద్ ఆర్టీవో కార్యాలయం ఎదుట జరిగిన దీక్షల్లో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. అనంతరం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తపస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొత్తగడి అంజిరెడ్డి, టీపీయూఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌లు మాట్లాడారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సీసీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు.
ఈ నెల 23న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ధర్మాగ్రహ దీక్షలో వికారాబాద్ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర కోశాధికారి కరణం లక్ష్మీకాంతారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర బహదూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ఈ దీక్షకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి మద్దతు తెలిపారు. ధర్నాలో రాష్ట్ర బాధ్యులు రాములు, జాక వెంకటేశం, కమాల్ రెడ్డి, ఆనందం, బుచ్చిలింగం, జిల్లా ఉపాధ్యక్షుడు బాకారం మల్లయ్య, కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశం, సంగమేశ్వర్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు రమాదేవి, శ్రీలత పాల్గొనగా, రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.