అన్నదాతకు యూరియా సరిపడా అందకపోవడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్దకు యూరియా కోసం రైతులు ఉదయాన్నే వచ్చారు. 10 గంటల వరకూ యూరియా రాకపోవడంతో విసుగు చెందిన వారు హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. అదేవిధంగా మర్పల్లి మండలంలో రైతులకు యూరియాను పంపిణీ చేయాలని తహసీల్దార్‌కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రాన్ని అందించారు. అంతకుముందు వారు తహసీల్దార్ కార్యాలయం నుంచి న్యూ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
కడ్తాల్, ఆగస్టు 26 : యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. వారం రోజులుగా సరిపడా యూరి యా అందక వారు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్దకు యూరియా కోసం రైతులు మంగళవారం ఉదయాన్నే వచ్చారు. 10 గంటలకు వరకు కూడా యూరియా రాకపోవడంతో విసు గు చెందిన అన్నదాతలు హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారం రోజులుగా తిరుగుతున్నా యూరియా లేదని చెప్తున్నారని, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని ప్రతిరోజూ తిప్పుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎప్పు డూ యూరియా కోసం ఇంతలా ఇబ్బంది పడలేదని పేర్కొన్నారు. ధర్నాతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచి పోవడంతో ట్రాఫిక్‌జామ్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో వెళ్లి రైతులను సముదాయించారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి యూరియా బుధవారం వస్తుందని చెప్ప డంతో రైతులు ఆందోళనను విరమించారు.
టోకెన్లు ఇచ్చి.. యూరియా ఇవ్వకపోవడంతో..
యాచారం : యూరియా కొరతపై మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం గోదాం వద్ద మంగళవారం రైతులు ధర్నా నిర్వహించారు. వారికి బీఆర్ఎస్, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం 9 గంటలకు రైతులకు యూరియా కోసం 100 మందికి అధికారులు టోకెన్లు ఇచ్చి సాయంత్రం వరకూ యూరియాను అందించకపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ యూరియా కొరత ఏర్పడలేదన్నారు. సరిపడా యూరియా అందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు బోడ కృష్ణ, సీపీఎం నాయకులు నరసింహ, అంజయ్య, బ్రహ్మయ్య, వివిధ గ్రామాల రైతులు ఉన్నారు.
ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే.. ; బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
రంగారెడ్డి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ):ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని రైతులు వ్యవసాయ పనులను వదులు కుని ప్రతిరోజూ పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు 30 నుంచి 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా, ప్రభు త్వం మాత్రం 15 నుంచి 20 వేల మెట్రిక్ టన్నులు కూడా అందించక పోవడంతోనే ఈ ఇబ్బందులని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు.
నియోజకవర్గంలో సింగిల్ టెండర్ విధానం..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వివిధ పనుల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో సింగిల్ టెండర్ విధానం కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఇతర కాంట్రాక్టర్లను బెదిరించి తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకే పనులను ఇప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లోనే ఈ టెండర్ విధానం కొనసాగు తున్నదన్నారు. ఒక్క కాంట్రాక్టర్‌కే అన్ని పనులను అప్పగించడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.
రైతులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి పట్టదా?
మర్పల్లి : రైతులకు సరిపడా యూరియా వెంటనే అందించాలని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మధుకర్ అ న్నారు. బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పిలుపు మేరకు రైతుల సమస్యలపై బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి న్యూ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ పరశురాంకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతులు పొలాలను వదిలి రోడ్డెక్కినా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ సొంత మండలంలో రైతులు యూరి యా కోసం అవస్థలు పడుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. యూరియా కోసం క్యూలో చెప్పులు, పాసు పుస్తకాలు పెట్టే దుర్మార్గపు పాలనను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లలితారమేశ్, సర్పంచుల సంఘం మాజీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ అంజయ్యగౌడ్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షు డు మధుకర్, టౌన్ ప్రెసిడెంట్ గఫార్, మాజీ సర్పంచులు గోపాల్‌రెడ్డి, అనిల్, పాండు, పీర్యానాయక్, మాజీ ఎంపీటీసీలు రవీందర్, శ్రీవిద్య వెంకటేశం, నాయకులు ఖాజా, వికాస్, జయరాజ్, బాలేశ్, ఆకాశ్, దీపక్, ప్రవీణ్, దయాకర్, డానియాల్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు పహారాలో పంపిణీ
కొందుర్గు : కొందుర్గు పీఏసీఎస్ కేంద్రం వద్ద రైతులు మంగళవారం యూరియా కోసం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. పూర్తిస్థాయిలో యూరియా రాకపోవడంతో అధికారులు పోలీసు పహారా మధ్య యూరియాను రైతులకు పంపిణీ చేశారు. గంటలు, రోజుల తరబడి క్యూలో నిలబడినా యూరియా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆధార్ కార్డుపై రెండు బస్తాల యూరియాను మాత్రమే పంపిణీ చేస్తుండడంతో పంట మొత్తానికి ఎలా సరిపోతుందని వాపోతున్నారు.
సరిపడా అందించాలని..
చేవెళ్లటౌన్: రైతులకు సరిపడా యూరియా అందించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ప్రభులింగం డిమాండ్ చేశారు. యూరియా సకాలంలో రైతులకు అందించాలని రాష్ట్ర రైతు సంఘం పిలుపుమేరకు మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జిల్లా రైతు సంఘం, రైతు సంఘం నియోజకవర్గ సభ్యుడు సుధాకర్‌గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్డీవో కార్యాలయ ఏవో రాజశేఖర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. రైతు సంఘం నాయకులు సత్తిరెడ్డి, పాపయ్య, మహిళా రైతులు వెంకటమ్మ, గంగోత్రి, దేవి, లలిత తదితరులు ఉన్నారు.