BJP MLA : కర్ణాటకలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే చంద్రులామని లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ల నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు వలవేసి పట్టుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రులామనిని అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటక, గడగ్ జిల్లాలో శనివారం జరిగింది. అరెస్టైన ఎమ్మెల్యే చంద్రులామని షిరాహట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
గడగ్ జిల్లాలో నీటి పారుదల శాఖకు సంబంధించి చేపట్టిన ఒక పనికి అనుమతి, ఆమోదం కోసం విజయ్ పూజార్ అనే క్లాస్-1 కాంట్రాక్టర్ నుంచి ఎమ్మెల్యే చంద్రు లంచం డిమాండ్ చేశాడు. అనుమతులు ఇచ్చి క్లియరెన్స్ రావాలంటే తనకు రూ.11 లక్షలు చెల్లించాల్సిందే అని పట్టుబట్టాడు. దీంతో కాంట్రాక్టర్ కర్ణాటకలో అవినీతి నిరోధక విభాగం అయిన లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో లోకాయుక్త పోలీసులు వలపన్ని ఎమ్మెల్యేను నేరుగా పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. సీనియర్ అధికారుల సలహాతో ఎమ్మెల్యేను పట్టుకునేందుకు తగిన ట్రాప్ రూపొందించారు. లంచంతో పట్టుబడ్డ తర్వాత తప్పించుకునేందుకు వీలు లేకుండా, తగిన ఆధారాలు సేకరించేలా ఈ ట్రాప్ నడిపించారు. అధికారులు ఊహించినట్లుగానే ఎమ్మెల్యే.. కాంట్రాక్టర్ దగ్గరి నుంచి లంచం తీసుకున్నాడు.
రూ.11 లక్షలకుగాను, అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు తీసుకోగా అధికారులు ఎమ్మెల్యేను పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. పూర్తి ఆధారాలతో ముగ్గురిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. కర్ణాటకలో లంచాలు, అవినీతిని అరికట్టడంలో లోకాయుక్త కీలకంగా పని చేస్తోంది.