– ఆన్లైన్లో పెట్టిన ఐదు నిమిషాలకే యూరియా నో స్టాక్
– ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతుల ఆందోళన
చిట్యాల, ఫిబ్రవరి 21 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. పీఎసీఎస్ లో 560 బస్తాల యూరియాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచిన ఐదు నిమిషాలకే నో స్టాక్ గా చూపించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం యూరియా స్టాక్ ఆన్ లైన్ నమోదు చేసిన కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా అయిపాయిందని సిస్టంలో చూపించారు. అయితే సమీప ప్రాంత రైతులకు కాకుండా ముందుగానే బుక్ చేసుకున్న కొందరికి మాత్రమే యూరియా అందిస్తున్నారని ఆరోపిస్తూ సంఘం కార్యాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పీఏసీఎస్ సిబ్బంది ముందుగానే తెలిసిన వారిచే యాప్ లో యూరియా బుకింగ్ చేయించుకుని బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
ఆన్లైన్లో ఉంచిన ఐదు నిమిషాలకే ఎలా అయిపోతుందని, సరైన సమయంలో యూరియా వేయకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించి అర్హులైన రైతులకు యూరియా అందించాలన్నారు. యాప్ లో 560 బస్తాల యూరియా బుకింగ్ చేసుకున్న రైతుల వివరాలను వెల్లడించాలన్నారు. యూరియా పంపిణీలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూరియా బుకింగ్ యాప్ ను రద్దు చేసి పట్టాదారు పాసు పుస్తకాల ప్రకారం అందించాలని పేర్కొన్నారు.