కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతం. ఎప్పుడొస్తదో పోతదో తెల్వని కరెంట్‌తో బావుల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఉండేది. ఏ అర్ధరాత్రో 2-3 గంటలు వచ్చే కరెంట్ వల్ల ఎందరో అన్నదాతలు విద్యుదాఘాతంతో మృత్యు ఒడికి చేరిన సంఘటనలు ఉన్నాయి. అరకొర విద్యుత్తు.. అందులోనూ లో ఓల్టేజీ సమస్యతో ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు, స్టార్టర్లు తరచుగా కాలిపోయేవి. దీంతో ఎండిన పంటను చూసిన రైతన్నలకు… గుండెలు బరువెక్కి బాధను దిగమింగుకోలేక కోపోద్రిక్తులై రోడ్లపైకి వచ్చి ధర్నాలు, సబ్స్టేషన్లను ముట్టడించేవారు.
కానీ.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ రైతన్నలకు పెద్దదిక్కులా నిలిచారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చి కరెంట్ కష్టాలకు చెక్ పెట్టారు. నిరంతర విద్యుత్ సరఫరాతో వ్యవసాయం పండుగలా మారింది. విరివిగా సబ్స్టేషన్లు, కేవీ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంతో మండు వేసవిలోనూ కరెంట్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అవుతున్నది. రంగారెడ్డి జిల్లాలో రూ.138కోట్లను వెచ్చించి కొత్తగా 27,516 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా 1,20,713 వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటలు ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. నిరంతర కరెంటుతో జిల్లాలో గణనీయంగా సాగు విస్తీర్ణమూ పెరిగింది.
– రంగారెడ్డి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో కరెంటు గోసలే. కాలిపోయిన మోటర్లు.. సరిపడా కరెంటు, సాగు నీళ్లు లేక ఎండిన పంటలు.. కరెంటు కోతలను నిరసిస్తూ రోడ్డెక్కిన అన్నదాతలు. అర్ధరాత్రి కరెంటుతో ఆగిన రైతన్నల గుండెలు… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముందు వరకు కూడా ఈ దుస్థితి నెలకొంది. కన్నీటి సేద్యం కారణంగా ఎందరో రైతుల బతుకులు ఆగమయ్యాయి. వారి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో కరెంటు కోసం రైతన్నలు పడ్డ గోస వర్ణణాతీతం. కానీ..స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ రంగం స్వరూపమే మారిపోయింది. పెరిగిన వ్యవసాయ కనెక్షన్లకు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సబ్స్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. క్షణం పాటు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండడం లేదు. రూ.138కోట్లను వెచ్చించి ప్రభుత్వం కొత్తగా 27,516 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 1,20,713 వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందుతున్నది. తీరిన కరెంటు కష్టాలు..పెరిగిన సాగుతో రైతు కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయి.’
కాంగ్రెస్, టీడీపీ.. పాలన ఎవరిదైనా రైతులకు మాత్రం కరెంటు కోతలు తప్పలేదు. వ్యవసాయానికి ఏడు గంటలు ఇస్తున్నట్లు చెప్పినప్పటికీ.. ఇచ్చేది మూడు నుంచి నాలుగు గంటల కరెంట్ మాత్రమే. అందులో సగం రాత్రి పూట ఇచ్చేవారు. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు ఇవ్వడంతో రైతులు రాత్రిళ్లు జాగారం చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో కరెంటు తీగలే యమపాశాలై ఎంతోమంది రైతులను బలితీసుకున్నాయి. ఓ వైపు కరెంటు కోతలు, మరోవైపు సాగు నీరు లేక కండ్ల ముందు పంటలు ఎండిపోతుంటే ఆగిన రైతుల గుండెలెన్నో. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల సందర్భంలోనూ ట్రాన్స్‌ఫార్మర్‌పైనే విగతజీవులుగా మారిన వారూ ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయి అనాథలుగా మారిన రైతు కుటుంబాలు కోకొల్లలు.
ఇచ్చేది అరకొర విద్యుత్తు. అందులోనూ లోవోల్టేజీ సమస్య. దీంతో ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు, స్టార్టర్లు తరచుగా కాలిపోయేవి. పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో రైతులే తలా కొంత డబ్బు పోగుచేసుకుని మరమ్మతులు చేయించుకునేవారు. దీంతో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేసిన సందర్భాలు అనేకం. తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి వంటి కార్యక్రమాలు నిత్యం ఎక్కడో ఒకచోట జరిగేవి. ఈ సందర్భంగా పాశవికంగా లాఠీ చార్జీలు జరిపిన ఉదంతాలూ ఉన్నాయి. ఈ క్రమంలో రైతులు తమ ప్రాణాలను పణంగా పెట్టిన సందర్భాలూ ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితి మారింది. పొరుగున ఉన్న రాష్ర్టాలు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంలో విఫలమయ్యాయి. కర్ణాటకలో ఇటీవల అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఈ విషయంలో చతికిల పడిపోయింది. కానీ..సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించారు. రాష్ట్రం ఏర్పడేనాటికి రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయానికి పగలు 3 గంటలు, రాత్రి 9 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేది. ప్రస్తుతం రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదు. గతంలో కంటే విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ కరెంటు కోతలు అసలే లేవు. జిల్లాలో రోజువారీ సగటు విద్యుత్ వాడకం 21.46మి.యూ.
ఉండగా.. అత్యధిక విద్యుత్ డిమాండ్ 784.73మెగావాట్లు ఉంటున్నది. మెరుగైన విద్యుత్ సరఫరా కోసమే ప్రభుత్వం 3,198కోట్లను ఖర్చుచేసింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా బోర్లు, బావుల కింద పంటల సాగు పెరగడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి జిల్లాలో 33/11కేవీ సబ్స్టేషన్లు 181 ఉండగా.. కొత్తగా 276 సబ్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రస్తుతం 1,17,717 కనెక్షన్లు ఉండగా, ఆయా రైతులకు ప్రభుత్వం 24 గంటలు నిరంతరాయంగా పూర్తి ఉచిత విద్యుత్‌ను సరఫరా జరుగుతున్నది. కొన్నేండ్లుగా అధిక మొత్తంలో పంట దిగుబడులను పొందుతున్నామని రైతులు సగర్వంగా చెబుతున్నారు. ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అందిస్తున్న నాణ్యమైన విద్యుత్ పట్ల రైతు కుటుంబాల నుంచి సంతోషం వ్యక్తం అవుతున్నది.
గత కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతల వలన మా తండ్రి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి అర్ధరాత్రి కరెంటు రాగానే మోటర్ ఆన్చేయటానికి వెళ్లి విద్యుత్‌షాక్‌కు గురై మరణించాడు. ఇబ్రహీంపట్నంకు చెందిన మా తండ్రి ఐలయ్య 2006 సంవత్సరంలో మోటర్ ఆన్‌చేయగా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన చనిపోయాడని, అప్పటి అధికారులు నిర్ధారించారు. మేము కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయాం. తమకు పరిహారం ఇవ్వాలని కోరగా ప్రభుత్వం అప్పట్లో పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు పరిహారం కానీ, ఉద్యోగం కాని ఇవ్వలేదు. గత పదిహేనేండ్లుగా పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అయినా, ఎవరూ స్పందించటంలేదు. తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలి.
– ప్రవీణ్, ఇబ్రహీంపట్నం
వికారాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంట్ కష్టాలతో రైతులు తీవ్రకష్టాలు ఎదుర్కొన్నారు. కరెంట్ ఎప్పుడొస్తదోనని ఎదురుచూడాల్సిన దుస్థితి ఉండేది. కాంగ్రెస్ హయాంలో అర్ధరాత్రి 2 నుంచి 3 గంటలపాటు కరెంట్‌తో పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఎంతో మంది విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. జిల్లాలో కూడా చాలా మంది రైతులు పంట పొలాలకు నీరు పెట్టేందుకు మోటర్లు ఆన్ చేయబోయి మృతిచెందారు. అయితే కాంగ్రెస్ హయాంలో రైతులకు కరెంట్ కష్టాలతో మరణాలు తప్ప చేసిందేమీ లేదు. బోర్లు, బావుల్లో నీరున్నా సాగు చేసుకోలేని దయనీయ పరిస్థితి నెలకొని ఉండేది. మళ్లీ కాంగ్రెస్‌కు అవకాశమిస్తే కరెంట్ కష్టాలు తప్పదని జిల్లా రైతాంగం నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ చీకటి అవుతుందని అక్కసు వెల్లగక్కిన సమైక్య పాలకుల వ్యాఖ్యలకు దీటుగా వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. నాడు కరెంట్ వస్తే వార్త.. నేడు కరెంట్ పోతే వార్త అనే విధంగా కనీవినీ ఎరుగని మార్పును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారు. రైతులకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలుత వ్యవసాయానికి పగలు 6 గంటలు, రాత్రి సమయంలో 3 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేసేందుకు నిర్ణయించి అమలు చేశారు. 2016 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేసిన ప్రభుత్వం… 2017 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తూ వస్తుంది. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా నిర్ణయంతో దేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
జిల్లావ్యాప్తంగా నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకుగాను రూ.303 కోట్లు ఖర్చు చేసి వ్యవసాయానికి 24 గంటలపాటు విజయవంతంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరాకుగాను 11,617 కిలోమీటర్ల మేర 33కేవీ, 11కేవీ, ఎల్టీ సామర్థ్యంగల విద్యుత్ లైన్లు వేయడంతోపాటు 13,145 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యతతో జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. నిరంతర విద్యుత్తు సరఫరాతో జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 3.30 లక్షల ఎకరాలుగా ఉన్న ఆయా పంటల విస్తీర్ణం ప్రస్తుతం 6 లక్షల ఎకరాలకు పెరిగింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కులకచర్ల, దోమ, బొంరాసుపేట, దౌల్తాబాద్, యాలాల, బషీరాబాద్, తాండూరు, పూడూరు మండలాల్లో ఆయా పంటల సాగు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 4 నుంచి 5 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమవుతుండగా, జిల్లాలో 75వేలు వ్యవసాయ కనెక్షన్లున్నాయి.