ఆదిబట్ల, జూలై 18 : రాష్ట్రం వదిలి బతుకుదెరువు కోసం కట్టుకున్న భార్య, పిల్లలతో కలిసి పొట్ట చేతబట్టుకుని వలస వచ్చారు. ప్రతిరోజూ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి పనులు ముగించుకొని ఆ భగవంతుని దర్శనం చేసుకొని వద్దామని కారులో యాదగిరిగుట్టకు వెళ్లి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని వస్తుండగా.. లారీ రూపంలో మృత్యువు వారిని కబళించింది. వారు ప్రయాణిస్తున్న కారు అతివేగం కారణంగా వర్షం పడుతుండడంతో ముందు ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జై మృతదేహాలు కారులో ఇరుక్కుపోయి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగులూరు ఎగ్జిట్ నం.12 ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది.
ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దాసరి తండా గ్రామం, గూడూరు మండలం, మహబూబాబాద్ జిల్లాకు చెందిన గూగులోత్ జనార్దన్(45) వృత్తి లేబర్., మాసంపల్లి తండా గ్రామం, పాకాల కొత్తగూడెం మండలం, వరంగల్ జిల్లాకు చెందిన మాలోత్ చందూలాల్(29) వృత్తి డ్రైవర్., ఎల్కపల్లి గ్రామం, మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన కావలి బాలరాజు(40) వృత్తి చికెన్ సెంటర్., వేదుల వలస గ్రామం, శ్రీకాకుళం జిల్లా, ఏపీకి చెందిన దాసరి భాస్కరరావు(39) వృత్తి సెక్యూరిటీ గార్డ్., కలం రాజుపేట గ్రామం, తెర్లాం మండలం, విజయనగరం జిల్లా, ఏపీకి చెందిన జడ కృష్ణ(25) వృత్తి డ్రైవర్. వీరందరికీ మొయినాబాద్‌లోని గ్రీన్ వాలీ రిసార్ట్‌లో వివిధ పనులపై రాగా పరిచయాలు ఏర్పడ్డాయి.
వీరంతా కలిసి గురువారం రాత్రి 8.30కి మొయినాబాద్ సమీపంలోని ఎన్కేపల్లి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి బెలెనో కారులో బయలుదేరారు. దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కలిసి తిరిగి ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఎన్కేపల్లికి బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్‌పై నం.12 ఎగ్జిట్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని అతివేగంతో ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మాలోతు చందూలాల్, కావలి బాలరాజ్, దాసరి భాస్కర్‌రావు, గూగులోతు జనార్దన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయమై ప్రయాణికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుకున్నారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో రెండు గంటల పాటు పోలీసులు శ్రమించి మృతదేహాలను బయటకి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి జాడ కృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, వందలాదిగా రావడంతో రోదనలతో మిన్నంటింది.
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో బాలరాజు మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలరాజు చికెన్ సెంటర్ నడుపుతూ భార్య, ముగ్గురు బిడ్డలను పోషించేవాడు. బాలరాజు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బిడ్దల రోదనలు మిన్నంటడంతో అంత్యక్రియలకు హాజరైన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు. మా నాన్న ఎక్కడ అని అడిగితే ఏమి చెప్పాలి, తండ్రి లేని పిల్లలుగా జీవించాలా నాన్న.. అమ్మ ఎలా బతుకుతుంది.. మమ్మలను ఎలా పోషిస్తుందని.. నువ్వులేని లోటు ఎవరు తీర్చుతారని బిడ్డలు రోదించడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను మహబూబాబాద్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకురాలు మాలోత్ కవిత సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై మండిపడ్డారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఫోన్లో సమాచారమిచ్చారు. ప్రభుత్వంలో ఉండి కూడా కనీసం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, ఉదయం వచ్చిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం తెల్లవారుజామున బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనా స్థలాన్ని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని సూచించారు.