కొత్తూరు, సెప్టెంబర్ 25 : రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మండలంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన జహంగీర్ పీర్ దర్గాలో వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ ముసియుల్లాఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియాజ్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కుమారుడు అజమ్అలీలో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో హైడ్రాతో పేదల ఇండ్లను కూల్చుతూ రేవంత్‌రెడ్డి యూపీ బుల్డోజర్ పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఉన్న మైనార్టీ నాయకుడు షబ్బీర్ అలీ రేవంత్‌రెడ్డి కోసం కామారెడ్డిని వదిలిపెట్టి త్యాగం చేస్తే సలహా దారుడి పదవి ఇచ్చి సెక్రటెరియేట్కే పరిమితం చేశారన్నారు. అలాగే అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని లీగల్ లిటిగేషన్లో ఇరికించారని, సియాసత్ నాయకుడు అమీర్ అలీఖాన్‌తో ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకొని
ఆయన్ను పక్క న పెట్టారన్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్‌రెడ్డి సొంత సెగ్మెంట్ కొడంగల్‌లో దర్గాను కూల్చివేయించారని.. మెదక్ మదర్సాలో విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. బోరబండలో గ్రేవ్‌యార్డ్ స్థలాన్ని కేటాయించాలని మైనార్టీలు కోరితే వారిపై కేసులు పెట్టించారన్నారు. కేసీఆర్ హిందూముస్లింలను సమదృష్టితో చూసి పాలన చేశారని గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ కార్యకర్తలు బాగుండాలని బాబాను కోరుకున్నట్లు చెప్పారు. అలాగే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలువాలని ప్రార్థించానన్నారు.
బీఆర్ఎస్ పదేండ్ల కాలంలోనే జేపీ దర్గా అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ మసియుల్లాఖాన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా దర్గాలో రూపాయి పని కూడా చేయలేదని విమర్శించారు. దర్గా మాస్టర్‌ను అజ్మీర్ దర్గా స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ రూ. 50 కోట్లు కేటాయించారని చెప్పారు.
దర్గా మాస్టర్ ప్లాన్‌లో చిరు వ్యాపారులకు నష్టం కలగొద్దని మాస్టర్ ప్లాన్ మార్చి పనులు చేసే లోపే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయని.. ఇప్పుడు రూ.50 కోట్ల నిధులున్నా మాస్టర్ ప్లాన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయాదవ్, నాయకులు యాదగిరి, ఇంద్రసేనారెడ్డి, జంగయ్యయాదవ్ పాల్గొన్నారు.