షాద్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని దళితుల సంక్షేమం, అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో నూతనంగా నిర్మించే ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారనే విషయాన్ని దళిత వర్గాల ప్రజలు గ్రహించాలని కోరారు. అదే విధంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ దళిత వాడల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తుందని చెప్పారు.
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని కాలనీలలో మౌలిక వసతులను కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు. ఎలికట్ట గ్రామంలో రూ. 50 లక్షలను వెచ్చించి ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని ఆధునాతన హంగులతో నిర్మిస్తున్నామని చెప్పారు. సంబంధిత గుత్తెదారులు నిర్మాణ విషయంలో రాజీ పడరాదని, నాణ్యత ప్రమాణాలను తప్పకుండా పాటించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, సర్పంచ్ సాయిప్రసాద్, ఉప సర్పంచ్ మల్లేశ్, నాయకులు కృష్ణయ్య, యాదయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.