కోట్‌పల్లి, జూలై 10 : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే దళిత బంధు పథకం ఏకంగా దళితుల తలరాతనే మార్చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో గతంలో కూలీలుగా ఉన్న వారు నేడు యజమానులు అయ్యారు. దళిత కుటుంబాలకు ఇచ్చిన రూ.10 లక్షలను వృథా చేయకుండా వివిధ యూనిట్లను నెలకొల్పి ఆర్థికంగా ఎదుగుతున్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక తమ తలరాతలు మారాయని దళితబంధు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దళిత బంధు కింద వికారాబాద్ , కోట్‌పల్లి నియోజకవర్గాల్లోని కోట్‌పల్లి మండలానికి తొలి విడుత కింద 17 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపికైన ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల చొప్పున రూ.కోటి 70 లక్షలను ప్రభుత్వం ఇచ్చింది. దీంతో కోళ్ల ఫారాలు, కిరాణం షాపులు, టెంట్ హౌజ్‌లు,ట్రాక్టర్లు వివిధ పరికరాలను కొనుగోలు చేసుకున్నారు. తీసుకున్న యూనిట్లతో లాభాలను పొందుతున్నారు. వీరికి అధికారులు అండగా ఉండి వ్యాపారాల్లో ఎలా రాణించాలన్న దానిపై అవగాహన సైతం కల్పించారు.
తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లోని కోట్‌పల్లి మండలంలోని 18 పంచాయతీలుండగా అందులో వచ్చిన ఇందోల్ ఒక యూనిట్‌తో కిరాణం, ఓగ్లాపూర్‌లో వచ్చిన రెండు యూనిట్లతో కిరాణం, సిమెంట్ షాపులు ఏర్పాటు చేసుకోగా, కోట్‌పల్లి మండల కేంద్రంలోని మూడు యూనిట్ల వారు ట్రాక్టర్లు కొనుగోలు చేసి వ్యవసాయ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. కరీంపూర్, బార్వాద్, రాంపూర్, జిన్నారం, బీరోల్, మోత్కుపల్లి తదితర గ్రామాల్లోని లబ్ధిదారులు కోళ్ల ఫారాలు, టెంట్ హౌజ్‌లు, కార్లు, ట్రాక్టర్లు, కిరాణం షాపులను ఏర్పాటు చేసుకుని లాభాలను గడిస్తున్నారు. ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్ లబ్ధిదారుల యూనిట్లను ప్రారంభించారు.
కోళ్ల ఫారానికి ఓనరైన..
గతంలో ఫర్టిలైజర్ షాపు పెట్టి నష్టపోయాను. చేసిన అప్పులు తీర్చలేక నానా ఇబ్బందులు పడిన. జీవితాన్ని ఎలా సాగించాలో ఆలోచిస్తున్న సమయంలో తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఓ వరమైంది. దళితబంధుకు ఎంపిక కావడంతో రూ.10 లక్షలు మంజూరయ్యాయి. మరో రూ.14 లక్షలు కలిపి కొళ్ల ఫారాన్ని పెట్టుకున్నా. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రారంభించారు. మొదటి దఫా కోళ్లను అమ్మితే మంచి లాభం వచ్చింది. కుటుంబ సభ్యులమంతా కలిసి పని చేసుకుంటున్నాం. ఓ ప్రైవేటు సెక్టారులో పని చేసే నేను కోళ్ల ఫారానికి ఓనరునైతానని కలల కూడా అనుకోలేదు. బతుకులకు దారి చూపిన సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– మల్ల నర్సింలు, గ్రామం. మోత్కుపల్లి, మండలం కోట్‌పల్లి