సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రుతు పవనాల కదలికలు నెమ్మదిగా ఉండటం, దానికితోడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఈ నెలలో కురవాల్సిన వానలు కొంత ఆలస్యంగా కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. సాధారణంగా ప్రతిఏటా జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతాయని, రుతుపవనాలు కేరళను తాకిన 10 రోజులకు అనగా.. జూన్ 10న తెలంగాణకు వస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారిణి శ్రావణి తెలిపారు. అయితే, ఈసారి రుతుపవనాలు కేరళను 8న తాకడం వల్ల తెలంగాణలోకి 18న వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మధ్యలోనే అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడటం వల్ల తేమ మొత్తం అటువైపు వెళ్లిపోవడంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు పెరిగినట్లు పేర్కొన్నారు. దీని ఫలితంగా ఈ ఏటా జూన్ మాసంలో వా నలు కురిసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం 39-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను వల్ల గాలిలోని తేమ మొత్తం అటు వెళ్లిపోవడంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడటం, దీనికి తోడు కిందిస్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండటంతో రాబోయే వారం, పది రోజుల వరకు ఎండల తీవ్రత తప్పదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వేడిగాలులు వీస్తుండటంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అరేబియాలో ఏర్పడిన తుఫాను బలహీనపడి, పూర్తిగా తొలగిపోతే తప్ప.. రుతుపవనాల కదలికలో వేగం పెరిగే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు.