సిటీబ్యూరో, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త , మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్లు టోకరా ఇచ్చారు. 18 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్న ఆమె పేరు, ఫొటోతో వాట్సాప్ సందేశం పంపి అకౌంటెంట్‌ను నమ్మించి సైబర్ నేరగాళ్లు రూ.1.20కోట్లు కాజేశారు. తాను ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, తాను చెప్పిన అకౌంట్‌కు డబ్బులు పంపాలంటూ మెసేజ్ చేయడంతో అకౌంటెంట్ ఆ నంబర్‌కు డబ్బులు పంపారు. మరోసారి అదే తరహాలో రావడంతో అతనికి అనుమానం వచ్చి మహిళా వ్యాపారవేత్తను సంప్రదించగా అసలు తాను మెసేజ్ పంపలేదని చెప్పి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో బడా వ్యాపారసంస్థలను నిలువునా ముంచుతున్నా రు.
ముఖ్యంగా కంపెనీల సీఈవోలు, సీఎఫ్ఓలు, అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ ఇంపర్సనేషన్ ఫ్రాడ్‌కు తెరలేపారని హైదరాబాద్ నగరపోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. తొలుత కంపెనీల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపి, మాల్వేర్ ద్వారా కంప్యూటర్లపై పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్‌ను పొందుతారని, ఆ తర్వాత సిస్టమ్‌లో యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను ఉపయోగించి, సీఈఓ పేరుతో అకౌంటెంట్లకు మెసేజ్ పంపిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా కీలక సూచనలు చేశారు.
కంపెనీలకు సంబంధించిన ఉన్నత వ్యక్తులు ’నేను అత్యవసర సమావేశంలో ఉన్నా ను, ఫోన్ ఎత్తడం వీలుపడదు, ఈ అకౌంట్‌కు వెంటనే కోట్లాది రూపాయలు బదిలీ చేయండి’ అని నమ్మబలుకుతూ సంస్థల సొమ్మును కాజేస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రతీ కంపెనీ అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. వాట్సాప్‌లో పై అధి కారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదని, అకౌంటెంట్లు వెంటనే సదరు అధికారికి నేరుగా ఫోన్ చేసి ధ్రువీకరించాలని కోరారు. ఆఫీసు సిస్టమ్స్‌లో నాణ్యమైన ఫైర్‌వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయడంతో పాటు వాట్సాప్ వెబ్ వాడిన ప్రతీసారి తప్పకుండా లాగవుట్ చేయాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హెల్ప్‌లైన్ నం.1930కి కాల్ చేయాలని సజ్జనార్ తెలిపారు.