కందుకూరు, మే 14 : కందుకూరు మండలం వాణిజ్య పంటలతో పాటు కూరగాయాల సాగుకు ప్రసిద్ధి. వానకాలంలో రైతులు సాధారణంగా పత్తి, కంది, మొక్క జొన్నల పంటల తర్వాత కూరగాయాల సాగుకు ప్రాధాన్యతను ఇస్తారు. కాగా మరి కొంత మంది రైతులైతే కేవలం కూరగాయాల పంటలనే సాగు చేస్తారు. టమటా, బెండ, వంగ, మిర్చి, క్యాబేజి, వంటి తదితర కూరగాయాల పంటలను పండించడంలో మండలం ప్రసిద్ధి గాంచింది.
గతంలో కూరగాయాలు పండించడానికి ముందు భూమిని సిద్ధం చేశాక నాణ్యమైన కూరగాయాల విత్తనాలను కొనుగోలు చేసి వారి వారి చేలల్లోనే నారు వేసి మొలత్తాక తగిన సమయం చూసి విత్తుకునే వారు. ప్రస్తుతం దాదాపు రైతులు ఈ పద్ధతికి స్వస్తి పలుకుతున్నారు. కారణం కొత్తగా కూరగాయాల నారు అందించే నర్సరీలు వెలిశాయి. దీంతో రైతులు తమ అవసరాలు తీర్చుకుంటున్నారు.
కాగా నగరానికి నియోజకవర్గం కూత వేటు దూరంలో ఉండటంతో చాలా మంది రైతులు కూరగాయాలను పండించి హైదరాబాదు మార్కెట్లకు తరలిస్తుంటారు. దీంతో కూరగాయాల సాగుకు చాలా మంది రైతులు మొగ్గు చూపడంతో కొందరు మండల కేంద్రంలో నర్సరీలను ఏర్పాటు చేసుకొని కూరగాయాల నార్లను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. నర్సరీల్లో మిరప, టమటా, క్యాబేజీ, కాలీప్లవర్, వంకాయ, తదితర కూరగాయాలతో పాటు రైతుల కోరిక మేరకు పూల మొక్కల నారును సైతం ఆర్డర్లపై అందిస్తున్నారు. ఏడాది పొడువునా రైతులకు కావాల్సిన నారును అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
రైతులకు కావాల్సిన పలు రకాల కూరగాయాల నారు నర్సరీల్లో సిద్ధంగా ఉంది. కొందరు రైతులు విత్తనాలు పెంచి తీసుకువెళతారు. ఇంకొంత మంది రైతులు నేరుగా కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఒక్కో మొక్క రైతులకు అనుకూల మైన రేట్లకు విక్రయిస్తాం. పూల మొక్కల ధరలు కూరగాయాల మొక్కల ధరలు వేర్వేరుగా ఉంటాయి. తమకు ఉపాధితో పాటు రైతులకు అనుకూలంగా ఉంటుంది.
గణేశ్, నర్సరీ నిర్వాహకుడు కందుకూరు