రంగారెడ్డి, మార్చి 14(నమస్తే తెలంగాణ): భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతుండడంతో. వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. నీరు లేక జిల్లాలో ఈసారి యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగితో పోలిస్తే ఈసారి పంటల విస్తీర్ణం 20వేల ఎకరాలు తగ్గింది. అరకొరగా సాగు చేసిన పంటలకు సైతం సాగు నీటి కొరత ఏర్పడడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పంటలను రక్షించుకునే ప్రయత్నంలో రైతన్నలు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో పంటల దిగుబడులపైనా అన్నదాతల ఆశలు సన్నగిల్లుతున్నాయి.
ఈసారి పంటలుడీలా..
జిల్లాలో యాసంగి పంటల సాగు లెక్కను వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి సాగు నివేదికను రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా 1,03,946 ఎకరాల్లో మాత్రమే యాసంగి పంటలు సాగయ్యాయి. పంటల వివరాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. రైతుల వారీగా సర్వే నంబరు, సాగు విస్తీర్ణంతోపాటు, వేసిన పంట, నీటి వసతి తదితర వివరాలను సమగ్రంగా సేకరించారు.
గత ఏడాది యాసంగిలో సాగు నీరు, కరెంటు తదితర వనరుల పుష్కలంగా ఉండడంతో జిల్లా రైతాంగం 1,23,240 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేసింది. అయితే ఈసారి యాసంగిలో గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రైతులు గత యాసంగి కంటే 20వేల ఎకరాల్లో తక్కువగా ఈసారి పంటలను సాగు చేశారు. గత యాసంగిలో వరి సాగు 90,447 ఎకరాలు ఉంటే.. ప్రస్తుత యాసంగిలో 83,110 ఎకరాల్లో మాత్రమే సాగైంది.
మక్క జొన్న గత సీజన్లో 13,530 ఎకరాలు ఉంటే.. ఈసారి 6,150 ఎకరాలకే పరిమితమైంది. సీజన్ ఆరంభం నుంచే పంటల సాగుకు రైతన్నలకు ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. పెట్టుబడులకు ప్రభుత్వం రైతుబంధు ఇవ్వకపోవడంతోపాటు కరెంటు కోతలను విధించింది. దీనికితోడు సరైన వర్షాలు లేక బోరు, బావుల్లో భూగర్భజలాలు అడుగంటి పంటలకు నీరందని దుస్థితి ఏర్పడింది.
ఇటువంటి పరిస్థితుల్లో పంటలను సాగు చేసే సాహసాన్ని రైతన్నలు చేయక పొలాలను పడావుగా ఉంచారు. మరోపక్క ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడంపైననూ రైతుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. చాలా చోట్ల పంటలు వాడిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏదిఏమైనా..ఈసారి యాసంగిలో పంటల సాగు విషయంలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి.
ఆందోళన కలిగిస్తున్న కరువు ఛాయలు
జిల్లాలో సాధారణ వర్షపాతం 660.5మి.మీ.లుకాగా, 656మి.మీ.ల వర్షం మాత్రమే కురిసింది. ఐదు మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 19 మండలాల్లో సాధారణ వర్షపాతం కురవగా..మూడు మండలాల్లో సాధరణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జనవరిలో 9.84మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఫిబ్రవరి నాటికి మరింత లోతుకు పడిపోయాయి.
12 మీటర్ల లోతుకు పడిపోవడంతో 500 అడుగుల లోతులో బోర్లు వేసినా నీరు పడే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో మెజార్టీ పంటలు బోర్లు, బావుల కిందనే సాగవుతున్నాయి. భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతుండడంతో నీటి వనరుల్లో నీటి మట్టాలు అడుగంటుతున్నాయి. కళ్లెదుటే పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని రైతులు పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పంటలతోపాటు కూరగాయల సాగు సైతం ప్రస్తుత సీజన్లో గణనీయంగా తగ్గింది. దీంతో కూరగాయలు, పండ్లు, పూల దిగుబడులు తగ్గిపోయి మార్కెట్లో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. వరితోపాటు వివిధ రకాల సాగు తగ్గడంతో వాటి ధరల పెంపుపై ప్రభావాన్ని చూపుతున్నాయి. కొన్నాళ్లక్రితం వరకు రూ.4వేలు ఉన్న క్వింటాల్ బియ్యం ధర రూ.6వేలకు పైగానే పలుకుతోంది.