షాద్‌నగర్, మే 27: రైతుల ఆలోచనలు కాలానికి అనుగుణంగా మారుతున్నాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దీటుగా అడుగులు వేస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు స్వస్తి చెప్పి శాస్త్రీయ వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడిని పొందేందుకు బిందుసేద్యంపై మొగ్గు చూపుతున్నారు. ఉద్యానవన పంటలతోపాటు పత్తి, మొక్కజొన్న, కంది వంటి పలు రకాల పంటలను సాగు చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. బిందు సేద్యంతో నీటి వృథాను అరికట్టడంతోపాటు కూలీల కొరతను అధిగ మించి.. సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చునని అధికారులు చెపుతున్నారు. భూగర్భ జలాలు తక్కువగా ఉన్న రైతులకు బిందు సేద్యం ప్రయోజకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
అధిక లాభాలను పొందాలంటే..
ఈ పద్ధతిలో అధిక లాభాలను పొందాలంటే రైతులు కూరగాయలు, పండ్లతోటలు, వాణిజ్య పంటలను సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టమాట, చిక్కుడు, మిరప, దొండ, బీర, సోరకాయ, క్యాప్సికం వంటి కూరగాయల పంటలతోపాటు పత్తి, ఆముదం, చెరుకు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి వాణిజ్య పంటల సాగుతో రైతు లు అధిక లాభాలను పొందొచ్చని పేర్కొంటున్నారు. వేసవిలో బిందు సేద్యంలో పూలతోటలను సాగు చేస్తే అధిక లాభాలొస్తాయని ఉద్యానవనశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పందిరి సాగు, పాలీహౌస్లతో సాగయ్యే పంటలకు బిందు సేద్యం వరంలా భావించవచ్చునని పేర్కొంటున్నారు.
రైతులకు సర్కారు చేయూత
రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రాయితీపై బిందు సేద్యం పరికరాలను అందిస్తున్నది. అదేవిధంగా ఈ సాగుపై క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖ అధికారులు రైతులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. నీటి కొరత, ఎరువుల వినియోగం, తగ్గుదల, కూలీల సమస్యకు పరిష్కా రం, కలుపు నివారణ తదితర అంశాలపై వారికి వివరిస్తున్నారు. 12.5 ఎకరాల్లోపు పొలం ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీతో పరికరాలను ప్రభుత్వం అందిస్తున్నది. అదేవిధంగా ఐదు ఎకరాల్లోపు ఉన్న బీసీ రైతులకు 90 శాతం రాయితీతో.. ఓసీ రైతులకు 80 శాతం రాయితీతో బిందు సేద్యం పరికరాలను సరఫరా చేస్తున్నది. ఒకసారి ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన రైతులు మరో మారు రాయితీలో బిందు సేద్యం పరికరాలను పొందాలంటే ఏడేండ్లు పూర్తి కావాల్సి ఉంటుంది.
జిల్లాలో 34,468 మంది రైతుల సాగు..
రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్, శేరిలింగంపల్లి మండలాలు మినహా మిగతా 23 మండలాల్లోని రైతులు సుమారు 34,468 మంది బిందు సేద్యం ద్వారా వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. వాటిలో పండ్లు, పూల తోటలు, కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలు ఉన్నాయి. మొయినాబాద్, ఫరూఖ్‌నగర్, చేవెళ్ల, కేశంపేట, షాబాద్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, కొందుర్గు, కొత్తూరు మండలాల్లో ఉద్యానవన రైతులు కూడా బిందు సేద్యం పద్ధతిలో పలు పంటలను సాగు చేసి లబ్ధి పొందుతున్నారు. బిందుసేద్యం పద్ధతిలో 29,279 ఎకరాల్లో పండ్ల తోటలు, 17, 772 ఎకరాల్లో కూరగాయలు, 4,082 ఎకరాల్లో పూల తోటలు, 443 ఎకరాల్లో ఇతర ప్రత్యేక ఉద్యానవన పంటలు, 242 ఎకరాల్లో పాలీహౌస్ ఉద్యానవన పంటలు, 763 ఎకరాల్లో పందిరి పంటలను సాగు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చితే ఈ ఏడున్నర ఏండ్ల కాలంలో బిందు సేద్యం పద్ధతిలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా మరో 308 మంది రైతులు బిందు సేద్యం ద్వారా పంటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు.
నీరు ఆదా అవుతుంది
బిందు సేద్యం ద్వారా పంటలను తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయొచ్చు. అంతేకాకుండా పంట దిగుబడితోపాటు ఆదాయం కూడా అధికంగా వస్తుంది. నీరు ఆదా అవుతుంది. సాధారణ సాగు తో పోల్చితే బిందు సేద్యంలో 30శాతం అధిక దిగుబడులొస్తాయి. విద్యుత్‌ను ఆదా చేయొ చ్చు. కలుపు నివారణ అదుపులో ఉండటంతో కూలీల సమస్య రైతులకు అం తగా ఉండదు. కుటుంబ సభ్యులతో కలిసి పనులకు పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా ఎరువులను మొక్కలకు నీటితోనే అందించడం ద్వారా పంటలకు పూర్తిస్థాయిలో లాభం చేకూరుతుంది. సాధారణ వ్యవసాయంలో రెండు బస్తాల ఎరువులు వాడితే ఈ పద్ధతిలో కేవలం 15 కిలోల ఎరువు సరిపోతుంది. పెట్టుబడి ఖర్చులు కూడా చాలావరకు తగ్గుతాయి. రైతులు ఆర్థికంగా ఎదుగుతారు.
ఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
రంగారెడ్డి జిల్లాలో బిందు సేద్యం పద్ధతిలో పంటలను సాగు చేస్తున్న రైతుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పరికరాలను వారు సద్వినియోగం చేసుకుంటున్నారు.