న్యూస్ నెట్వర్క్ (నమస్తే తెలంగాణ), జూన్ 21 ; పదేండ్ల కేసీఆర్ పాలనలో 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేయడంతో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే తడవుగా విద్యుత్తు కోతలు పెట్టడమే పనిగా పెట్టుకున్నది. దీంతో రైతులు నేడు నాణ్యమైన కరెంట్ లేక నానా అవస్థలు పడుతున్నారు. రైతులు పంట చేల వద్ద విద్యుత్తు కోసం రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. ఏ నలుగురు రైతులు కలిసినా కరెంట్ కష్టాల గురించే మాట్లాడుకోవడం కనిపిస్తున్నది. నాణ్యత లేని విద్యుత్తు సరఫరాతో కొన్ని చోట్ల మోటర్లు కాలిపోతుండగా.. వాటిని బాగుచేసి చెప్పిన సమయానికి రైతులకు ఇవ్వలేకపోతున్నామని మెకానిక్‌లు చెబుతున్నారంటే కరెంట్ సరఫరా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ రాకముందు పడిన ఇబ్బందులు మళ్లీ మొదలయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సకాలంలో వర్షాలు కురవక అన్నదాత ఆకాశం వైపు చూసే పరిస్థితి ఉన్నది. ఈ తరుణంలో పలువురు రైతులు మాట్లాడుతూ ‘కేసీఆర్ హయాంలోనే కరెంట్ బాగుండే. ముచ్చటగా మూడు పంటలు సాగు చేసేటోళ్లం.. కాంగ్రెస్ తీరు రైతులను మళ్లీ అప్పుల ఊబిలోకి నెట్టింది. ఎప్పుడు కరెంటు వస్తుందో.. ఎప్పుడు పోతుందో అర్థంకాని పరిస్థితులున్నాయి’ అని వాపోతున్నారు. నిరంతర విద్యుత్తు సరఫరాతో రైతు మోములో ఆనందం నింపిన కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానించడం సరైందికాదని రైతులు సూచిస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక.. పాలన చేతగాకే రేవంత్ సర్కారు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నదని మండిపడితున్నారు.
తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం..
చీటికీమాటికి విధిస్తున్న కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నాం. కేసీఆర్ పాలనలో రెప్పపాటు కూడా కరెంట్ పోయేదికాదు. ఆరు నెలల్లో కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. నిరంతర విద్యుత్తు ప్రజలకు అందించిన కేసీఆర్‌పై కక్ష సాధింపునకు పాల్పడడం అమానుషం. దీన్ని యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తున్నది.
– ఎ.గోవర్ధన్, కమ్మెట గ్రామం, చేవెళ్ల మండలం
చీటీకిమాటికి కరెంట్ పోతుంది
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనలో పదేండ్లుగా గృహాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ ఇవ్వడం వల్ల అందరికీ ఉపయోగంగా ఉన్నది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కొద్దిపాటి చినుకులు పడినా, గాలి దుమ్ము వచ్చినా విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నది. రాష్ట్రం ఏర్పడక ముందు మోటర్ల వద్ద రైతులు కాపలా ఉండేవారు. కానీ కేసీఆర్ హయాంలో ఆ పరిస్థితి మారి నిరంతరం విద్యుత్తు సరఫరా అయ్యేది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులకు పాత పరిస్థితులు వచ్చాయి.
-జంతుక అల్లాజీ, జంగారెడ్డిపల్లి, ఆమనగల్లు మున్సిపాలిటీ
పదేండ్ల కిందటి రోజులొచ్చినయ్..
ప్రస్తుతం పదేండ్ల కిందటి రోజులు మళ్ల్లీ వచ్చాయి. కరెంటు ఎప్పుడుపడితే అప్పుడు పోతున్నది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత కరెంటు పోతదనే ఆలోచన లేకుండా చేసిండు. కార్పెంటర్, విండోస్, డోస్ ఫిట్టింగ్ చేసేందుకు కరెంట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. కరెంట్ లేకపోతే ఎక్కడి పని అక్కడే ఆగిపోతుంది. పదేండ్ల కిందట కరెంట్ లేక పని మానుకుని ఖాళీగా కూర్చునేటోళ్లం.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో పనులు సాఫీగా సాగడం లేదు.
-సాయికుమార్, వ్యాపారి,వికారాబాద్
ఎడాపెడా విద్యుత్తు కోతలు..
గత ఆరు నెలల నుంచి విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఎడాపెడా కోతలతో తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. చిన్నపాటి వర్షం, గాలి వచ్చినా సరఫరా నిలిపివేస్తున్నారు. ప్రజల అవసరాలతో ప్రభుత్వానికి పని లేదు. విద్యుత్తు విషయంలో కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నాలు రేవంత్ సర్కార్ మానుకోవాలి
– కొల్లగల్ల భాస్కర్,ఈర్లపల్లి గ్రామం,చేవెళ్ల మండలం
బీఆర్ఎస్ హయాంలోనే కరెంటు బాగుండేది..
సమైక్య పాలనలో కరెంటు సక్రమంగా ఉండకపోయేది. ఎప్పుడుపడితే అప్పుడే పోయేది. పని చేసుకుందామంటే కుదరకపోయేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కృషితో 24 గంటలూ కరెంట్ ఉండేది. రైస్ మిల్లు నిరంతరం నడువడంతో వ్యాపారం బాగుండేది. ప్రస్తుతం రోజుకు రెండు, మూడు సార్లు కరెంట్ పోతున్నది. దీంతో రైస్ మిల్లులో పనులు ఆలస్యమవుతున్నాయి. పదేండ్లుగా ఎలాంటి కరెంటు సమస్య లేకుండా చేసిన కేసీఆర్ సారుపై కాంగ్రెస్ సర్కార్ నిందలేయడం సరికాదు. ప్రస్తుతం కరెంట్ కోతలతో ఇబ్బందులకు గురవుతున్నాం. – సురేశ్, రైస్ మిల్ నిర్వాహకుడు,
వికారాబాద్