ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలు నీటిపాలయ్యాయి. ఇండ్లు కూలిపోయి చాలామంది నిరాశ్రయులయ్యారు. విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లూ నామరూపాల్లేకుండా దెబ్బతిన్నాయి. దీంతో నడవలేం..వాహనాలను నడపలేం అన్నట్లుగా పరిస్థితి మారింది. అయితే జిల్లాలో 917 ఎకరాల్లో పంట నష్టం జరి గినట్లు వ్యవసాయ శాఖ చెబుతుండగా..తుది నివేదికను ఇంకా ఇవ్వలేదు. మిగతా శాఖలు సైతం నివేదికలను అందజేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. దీంతో నివేదికలు ఇచ్చేదెప్పుడు? ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టేదెప్పుడు..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క వర్షాలకు వీధులు చిత్తడిగా మారి పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని పల్లె, పట్టణ ప్రజానీకం ఆందోళన చెందుతున్నది.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో వర్షాలకు జరిగిన నష్టాన్ని తేల్చడంలో వివిధ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నాయి. ప్రాథమిక పరిశీలనలో 40 వరకు ఇండ్లు కూలిపోగా, 107 విద్యుత్తు స్తంభాలు దెబ్బతినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అలాగే షాద్నగర్-అయ్యవారిపల్లి రోడ్డు, కొందుర్గు- కొల్లూరు రోడ్డు, వెలమలతండా-తంగేడుపల్లి రో డ్లు దెబ్బతిన్నట్లు అంచనాకు వచ్చారు. అలాగే.. 917 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే అన్ని శాఖలు తుది నివేదికలను సమర్పించడంలో జాప్యం చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.
శుక్రవారం సాయంత్రానికి కూడా కొన్ని శాఖల నివేదికలు జిల్లా అధికారులకు అందలేదు. వానకాలంలో జిల్లాలో అత్యధికంగా పత్తిని సాగు చేస్తుండగా… ఆ తర్వాతి స్థానంలో వరి ఉన్నది. ఎడతెరిపి లేకుండా ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంటకే ఎక్కువ నష్టం వాటిల్లింది. అలాగే వరి, జొన్న, మొక్కజొన్న వంటి పంటలు సైతం నీటిలో మునిగిపోయాయి. రైతన్నల ఆరుగాలం శ్రమ నీటి పాలైం ది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం కోసం రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు ఓ వైపు క్రాప్బుకింగ్, రుణమాఫీ వంటి వా టితో బిజీగా ఉండడంతో తుది నివేదికను రూపొందించడంలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ఇతర శాఖలు సైతం జరిగిన నష్టాన్ని తేల్చకపోవడంతో ప్రభు త్వం తరపున చేపట్టే సహాయక చర్యల్లోనూ జాప్యం జరుగనున్నది.
సీజనల్ భయం..
ఓ వైపు వర్షాలు..మరోవైపు పంచాయతీల పాలన మొక్కుబడిగా సాగుతుండడంతో పల్లెలను వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వర్షాలకు వీధులన్నీ బురదమయంగా మారాయి. చెత్తాచెదారం పేరుకుపోతున్నది. దీంతో పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. విష జ్వరాలతోపాటు డెంగీ కేసులూ అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో వేల సంఖ్యలో వైరల్ ఫీవర్ కేసులు నమోదు అవుతుండగా.. డెంగీ కేసులు సైతం 200లకు చేరువలో ఉన్నాయి. పంచాయతీలను నిధుల కొరత వేధిస్తుండడంతో సకాలంలో సహాయక చర్యలు చేపట్టే పరిస్థితిలో ప్రత్యేక అధికారులు లేరు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడం.. పారిశుధ్య నిర్వహణ ఇలాగే ఉంటే.. పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని గ్రామీణ, పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.