రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.. రైతులు కన్నీరు పెడితే రాజ్యానికి చేటువచ్చినట్లే.. రైతును రాజుగా చూసినప్పుడే రాజ్యం బాగుపడుతుందని ఎనుకటికి పెద్దలు చెప్పేవారు. కాని నేటి కాంగ్రెస్ సర్కారు రైతుల గురించి పట్టించుకోవడంలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేతికందే సమయంలో నీరు సరిపోక వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. దీంతో ఆరుగాలం శ్రమించినా అప్పులే దిక్కయ్యే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు.
ఏ గ్రామంలో చూసినా ఎండిన పంటలే దర్శనమిస్తున్నాయి. గత పదిహేను రోజుల్లో సుమారు వంద ఫీట్ల వరకు భూగర్భజలాలు తగ్గిపోయాయి. దీంతో పది రోజుల క్రితం వరకు కూడా పోసిన బోర్లు కూడా ఎండిపోగా.. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చాలా మంది రైతులకు రైతు భరోసా రాక, రుణమాఫీ కాక పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సాయం అందించాలని పలువురు అన్నదాతలు కోరుతున్నారు.
రంగారెడ్డి, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : యాసంగిలో రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సుమారు 90 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందనే నమ్మకంతో ఎక్కువ మంది అన్నదాతలు అప్పులు చేసి పంటలు సాగు చేశారు. మరో 20 రోజుల్లో పంటలు చేతికందుతాయనే దశలో కండ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాలతోపాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు వంటి మండలాల్లో పంటలు చేతికందే సమయంలో ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంట పొలాలకు అందిస్తున్నారు. కొన్ని చోట్ల అప్పులు చేసి మరీ అదనపు బోర్లు వేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతున్నది.
వేలాది ఎకరాల్లో ఎండిన పొలాలు
రంగారెడ్డిజిల్లాలో పది నుంచి పదిహేను వేల ఎకరాల వరకు వరి పంట ఎండిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. ముఖ్యంగా మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కేశంపేట, కొందుర్గు, శంకర్పల్లి, చేవెళ్ల, షాబాద్ వంటి మండలాల్లో పంటలు పెద్దఎత్తున ఎండిపోతున్నాయి. పంటలు చేతికందే సమయానికి దీని తీవ్రత మరింత ఉంటుందని రైతులు వాపోతున్నారు.
కులకచర్ల : చౌడాపూర్ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో ఎండిన పంటలతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన పలువురు రైతులకు చెందిన పంటలు బోర్లలో నీరు ఎండిపోవడంతో వరి పంట చేతికి రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 1850 ఎకరాల్లో వరి పంట సాగుచేసినట్లు చౌడాపూర్ మండల వ్యవసాయాధికారి పరిమళ తెలిపారు. బోర్లలో నీటి శాతం తగ్గడం వలన అక్కడడక్కడ వేసిన వరి పంట పొలాలు ఎండిపోతున్నాయని తెలిపారు. లింగంపల్లి రెవెన్యూపరిధిలో 196 మంది రైతులు వరి పంట వేసినట్లు తమ దగ్గర నమోదు చేసుకున్నారని ఏఈవో విశ్వనాథం తెలిపారు.
పరిగి : పరిగి మండలం రూప్ఖాన్పేట్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ కుటుంబం బోరు కింద ఎకరంన్నర విస్తీర్ణంలో వరి పంటను సాగు చేశారు. పంట సాగు కోసం సుమారు రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టారు. విత్తనాలు మొదలుకొని ఎరువులు, కరిగెట, నాట్లు వేయడం వరకు డబ్బులు ఖర్చు చేసి పంట సాగు చేపట్టారు. అంతా బాగుందనుకున్న తరుణంలో బోరులో నీరు తగ్గిపోయింది. మరో పక్షం రోజుల్లో పంట చేతికి అందుతుందని ఆశించగా.. బోరులో నీరు తగ్గడంతో రైతు కుటుంబం ఆందోళనకు గురైంది. దీంతో సాగు చేసిన ఎకరంన్నర వరి పంటలో సగం పూర్తిగా ఎండిపోయింది. సగం పంటకే నీరు అందుతున్నది. పంట కోసం పెట్టిన పెట్టుబడి రాదని, ప్రభుత్వం తమను ఆదుకొని సహాయపడాలని కోరుతున్నారు.
చేతికందే సమయంలో ఎండిపోతున్న పంటలు
మరో పది రోజుల్లో పంటలు చేతికందుతాయనుకున్న సమయంలో ఉన్న బోర్లు పూర్తిగా ఎండిపోవటంతో పంట పొలాలు ఎండుముఖం పట్టాయి. దీంతో మేము పెట్టిన పెట్టుబడులు, చేసిన కష్టం పూర్తిగా నేలపాలైంది. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించడంలేదు.
– పర్వతాలు యాదవ్, మాడ్గుల మండలం
అప్పులు మీద పడుతున్నాయి
చేసిన కష్టం నేలపాలైంది. అప్పులు తీరే మార్గం లేకుండా పోయింది. అప్పులెలా కట్టాలో తెలియక అవస్థలు పడుతున్నాం. అప్పులిచ్చినవారు ఆగే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆదుకుని రైతులను కాపాడాలి.
– రాములు, నల్లచెరువు, మాడ్గుల మండలం
పంటను కాపాడలేక పోతున్నా..
నేను వేసిన పంటను కాపాడుకునేందుకు చాలా కష్టపడ్డాను. తీరా బోర్లలో నీటి శాతం తగ్గి పూర్తి స్థాయిలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. నేను రెండు ఎకరాల్లో పంట సాగు చేశాను. అందులో ఎకరం పొలం ఎండిపోయింది. నీళ్లు చాలక వేసిన పంటను కాపాడలేకపోతున్నాను. గతంలో ఎప్పడూ ఇలాంటి సమస్యను ఎదుర్కొనలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని వ్యవసాయ అధికారులు కూడా తెలుపలేదు. అప్పులు చేసి పంటను సాగుచేశాను. పంట ఎండిపోగా పశువులకు మేపే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
– మ్యాకల లక్ష్మయ్య, రైతు, లింగంపల్లి, చౌడాపూర్ మండలం
పంట ఎండిపోయింది
నేను బోరు కింద పంట వేయడానికి అడవివెంకటాపూర్ గ్రామానికి చెందిన గోవిందమ్మ వద్ద రెండు ఎకరాల పొలాన్ని 15 వేలకు కౌలుకు తీసుకున్నాను. కౌలుకు తీసుకున్న సమయంలో బోరులో నీరు పుష్కలంగా ఉన్నది. కాని ప్రస్తుతం నీటి శాతం పూర్తిగా తగ్గింది. దీంతో రెండు ఎకరాల్లో ఎకరంన్నర పొలం ఎండిపోయింది. కౌలు డబ్బులు ఎలా కట్టాలో అర్థం కావడంలేదు. డబ్బులు కట్టడానికి పుణే, ముంబయికి వలస వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– బైరం శ్రీనివాస్, రైతు, లింగంపల్లి
అప్పు ఎలా తీర్చాలో..
నాకున్న రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాను. ఈసారి వర్షాలు బాగానే పడ్డాయని, బోర్లలో నీళ్లు కూడా బాగానే ఉన్నాయని భావించి బోరు కింద ఉన్న రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాను. వేసిన నాటి నుంచి నేటి వరకు పంటను కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడ్డాను. కాని వరి చేను ఎన్నులు విరిచే సమయంలోనే బోర్లలో నీళ్లు పూర్తిగా తగ్గిపోయి పొలానికి నీటిని అందించలేని స్థితి వచ్చింది. ఇప్పటికే ఎకరం మేరకు పంట ఎండిపోయింది. పంట వేయడానికి అప్పు తీసుకువచ్చాను. ఎలా తీర్చాలో తోచడంలేదు.
– మ్యాకల నర్సయ్య, రైతు, లింగంపల్లి, చౌడాపూర్ మండలం