వికారాబాద్ జిల్లాలో వేసవి కాలం ప్రారంభం కాకముందే భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భజలాలు క్రమంగా తగ్గుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాది ఫిబ్రవరి నాటికి జిల్లాలో 13.21 మీటర్ల లోతులో భూగర్భజలాలుండగా, ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి 13.58 మీటర్ల లోతుకు జిల్లాలో భూగర్భజలాలు పడిపోయాయి. మార్చి చివరి నుంచి ఏప్రిల్, మే వరకు జిల్లాలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో తగ్గే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు.
మరో వారం, పది రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశమున్న దృష్ట్యా భూగర్భజలాలు కూడా భారీగా తగ్గనున్నాయి. ఇప్పటికే జిల్లాలోని మెజార్టీ చెరువుల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. చెరువులతోపాటు ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడం చూస్తే ఈనెలాఖరు నాటికి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కోట్పల్లి, లక్నాపూర్, జుంటుపల్లి, శివసాగర్, కాకరవేణి, అల్లాపూర్, నందివాగు, సర్పన్పల్లి ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు సగానికిపైగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూగర్భజలాలను పెంపొందించేందుకు ప్రతి గ్రామపంచాయతీలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకుడు గుంతలను నిర్మిస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిగా ఇంకుడుగుంతల నిర్వహణను పూర్తిగా విస్మరించింది.
– వికారాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో ఫిబ్రవరి చివరి నాటికి 13.58 మీటర్ల లోతుకు అడుగంటిపోయాయి. ఎండల తీవ్రత పెరగడంతో భూగర్భజలాలు క్రమంగా తగ్గుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి .37 మీటర్ల మేర నీటి నిల్వలు తగ్గాయి. అయితే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరీ దారుణంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు తాగునీటి సమస్య లేకుండా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరందించి తాగునీటి కష్టాలకు చెక్ పెట్టగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లడంతోపాటు ట్యాంకర్ల వద్ద యుద్ధాలు నెలకొన్న పరిస్థితులను ప్రజలు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. గత నెల రోజులుగా ఎండల తీవ్రత పెరిగి భూగర్భజలాలు అడుగంటిపోవడంతోపాటు మిషన్ భగీరథ నీటి సరఫరా అంతంత మాత్రంగానే జరుగుతుండడంతో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచే జిల్లాలో తాగునీటి సమస్య నెలకొన్నది.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలోనూ తాగునీటి కోసం తండాల ప్రజలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. మరోవైపు ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో మిషన్ భగీరథ నీరు ఎప్పుడొస్తాయో తెలువని పరిస్థితి నెలకొన్నది. గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాకు సంబంధించి వారానికి ఒక్క రోజు మాత్రమేనీటిని వదులుతున్నట్లు, కొన్ని గ్రామాల్లో అది కూడా లేకపోవడంతో వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు.
మున్సిపాలిటీల్లోనూ మిషన్ భగీరథ నీటి సరఫరా మూడు, నాలుగు రోజులకోసారి సరఫరా అవుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. సరిగ్గా వేసవి రాక ముందే తాగునీటికి సంబంధించి పరిస్థితులు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలను గాలికి వదిలేసింది. గతేడాది వేసవికాలంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చేసిన మరమ్మతులకు సంబంధించి రూ.4 కోట్ల నిధులు ఇంకా పెండింగ్లోనే ఉండడంతో ఈ ఏడాది తాగునీటి మరమ్మతుల పనులు ఏ విధంగా చేయించాలనే దానిపై సంబంధిత అధికారులకు తలనొప్పిగా మారింది.
వికారాబాద్ 42.98
(మైలార్దేవ్పల్లి)
దుద్యాల 29.88
మర్పల్లి 22.39
మర్పల్లి
(నర్సాపూర్) 32.56
నవాబుపేట్
(మాదిరెడ్డిపల్లి) 21.28
దోమ
(దిర్సంపల్లి) 17.25
యాలాల
(దేవనూర్) 28.98
ధారూరు
(అంతారం) 16.42
దోమ 14.25
కోట్పల్లి 14.56
కులకచర్ల
(ముజాహిద్పూర్) 15.32
పరిగి
(రంగంపల్లి) 42.35
తాండూరు
(ఉద్దండాపూర్) 29.42
జిన్గుర్తి 19.48
కొడంగల్
రుద్రారం 15.46