వికారాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని భారీ వర్షాలకు పంటలు నష్టపోవడంతోపాటు ఇండ్లు నేలకూలాయి. నిరాంతరాయంగా కురిసిన వర్షాలకు ఉన్న చిన్న గూడు కూడా కూలిపోవడంతో చాలా మంది నిరుపేదలు నిరాశ్రయులయ్యారు. వర్షాలకు కొన్ని చోట్ల పూర్తిగా ఇండ్లు కూలగా, మరికొన్ని 50 శాతానికిపైగా దెబ్బతిన్నాయి. దీంతో నష్టపోయిన ఇండ్లకు ప్రభుత్వం నుంచి పరిహారం నష్టానికి తగినట్లుగా వస్తుందని బాధితులు ఆశించినప్పటికీ సర్కారు మాత్రం అరకొర సాయం అందజేసింది. నివాసముంటున్న ఇండ్లు కూలి నిరాశ్రయులైన వారికి ప్రభుత్వ నిర్ణయంతో నిరాశే మిగిలింది. సర్కారు ప్రకటించిన సాయంపై బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం మళ్లీ కొంత పెంచుతూ కొత్త జీవోను విడుదల చేయడం గమనార్హం. అలాగే పంట నష్టానికి సంబంధించి అధికారులు వివరాలను ప్రభుత్వానికి అందజేసినా ఇప్పటివరకు సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు.
– వికారాబాద్, సెప్టెంబర్ 18, (నమస్తే తెలంగాణ)
జిల్లాలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని భారీ వర్షాలకు ఇండ్లు కూలిన బాధితులకు ప్రభుత్వం మొదట కేవలం రూ.3200 సాయాన్ని అందజేసింది. ఇండ్లు కూలి గూడుతోపాటు ఇంట్లోని సామగ్రి అంతా కోల్పోయిన బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రూ.16,500 అందజేస్తామని ప్రకటించి ఉత్తర్వులు జారీ చేసింది. సాయం చేసిన రూ.3200 పోనూ మిగిలిన రూ.13,300లను అధికారులు బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. కూలిన ఇండ్లు కట్టుకునేందుకు కాదు కదా.. కనీసం కూలీలకు కూడా ప్రభుత్వం ఇస్తున్న సాయం సరిపోదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 333 ఇండ్లు నేలకూలినట్లు జిల్లా యంత్రాంగం లెక్కతేల్చింది.
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అపార పంట నష్టం జరిగింది. పంట నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు ప్రభుత్వానికి అందజేసినా ఇప్పటివరకు పంట నష్టపరిహారంపై సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎకరానికి ఎంతమేర నష్టపరిహారం అందజేస్తామనేది కూడా ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం. అప్పులు చేసి పంటలు వేసిన రైతులకు వర్షాలతో దెబ్బతిన్న పంటల స్థానంలో కొత్త పంటలు వేసేందుకుగాను పెట్టుబడి సాయం కూడా లేకపోవడంతో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఎప్పుడు అందుతుందోనని ఎదురుచూస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 1125 మంది రైతులకు చెందిన 1242 ఎకరాల్లో ఆయా పంటలకు నష్టం వాటిల్లింది. ఎక్కువగా దౌల్తాబాద్, కొడంగల్, వికారాబాద్, ధారూరు, నవాబుపేట మండలాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. నష్టపోయిన పంటల్లో కూడా ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, కంది పంటలే ఉన్నాయి. కొడంగల్ మండలంలో వరి 46 ఎకరాలు, పత్తి-79 ఎకరాలు, కందులు-32 ఎకరాల్లో నష్టం జరిగింది. ధారూరు మండలంలో పత్తి-244, మొక్కజొన్న-45 ఎకరాల్లో., వికారాబాద్ మండలంలో వరి-32, పత్తి-338, మొక్కజొన్న-46, పసుపు-40, కందులు-34 ఎకరాల్లో., నవాబుపేట మండలంలో పత్తి-70 ఎకరాల్లో., దౌల్తాబాద్ మండలంలో 87 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది.
ఇండ్లు కూలిపోయినవారికి ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం రూ.16,500 ఏమాత్రమూ సరిపోదు. ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఇల్లు మళ్లీ కట్టుకోవాలంటే చాలా డబ్బులు కావాలి. సరిపడా డబ్బులు సర్కారు మంజూరు చేయాలి. దెబ్బతిన్న ఇండ్లకు కూడా నష్టపరిహారం ఎక్కువగా ఇవ్వాలి.
– జి.కృష్ణ. అంపల్లి, ధారూరు మండలం
ఇటీవల కురిసిన భారీ వర్షానికి మా ఇంటి వెనుక భాగం పూర్తిగా కూలిపోయింది. ఇంటి లోపలి వైపు కూలి ఉంటే అందరం చనిపోయేవాళ్లం. సుమారు రూ.2లక్షల వరకు నష్టం జరిగింది. తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాను కానీ ఇప్పటివరకు నష్టపరిహారం రాలేదు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలి.
– గడ్లెనిబాయి లక్ష్మయ్య, కొత్లాపూర్, మర్పల్లి మండలం
ఇల్లు కూలిన మాకు మొదటగా రూ.3200 ఇచ్చారు. అది సరిపోదని విజ్ఞప్తి చేస్తే మళ్లీ రూ.13,300 సాయం చేస్తామన్నారు. ఆ డబ్బులు దేనికీ సరిపోవు. ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. పూర్తి ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఇవ్వాలని కోరుతున్నాం. అప్పుడే ఇల్లు నిర్మించుకోగలుగుతాం.
– సార భీమమ్మ, మోమిన్ఖుర్దు, ధారూరు మండలం