వికారాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : నైరుతి రుతుపవనాల రాకతో జిల్లాలో తొలకరి వర్షం పలకరించింది. రెండు, మూడు రోజులుగా జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. తొలకరి జల్లులు సరైన సమయానికి కురువడంతో ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మోస్తరు వర్షమే కురిసినందునా ఇప్పుడే విత్తనాలను నాటొద్దని జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. భూమిలో సరిపడా పదును ఉంటేనే విత్తనాలు నాటాలని, లేదంటే మొలకెత్తిన విత్తనాలు ఎండిపోయే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రధానంగా 60 నుంచి 70 మి.మీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనాలు నాటితే నాటిన ప్రతి విత్తనం మొలకెత్తే అవకాశముంటుందని అధికారులు ఊరూరా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచారు.
5.97 లక్షల ఎకరాల్లో సాగు..
వికారాబాద్ జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 5,97,830 ఎకరాల్లో ఆయా పంటలు సాగు అవుతాయని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అందులో పత్తి-2,63,500 ఎకరాలు, కంది-1,50,000, మొక్కజొన్న-50,450, వరి -1,10,000, మినుములు-5,000, సోయాబీన్-2,500, జొన్నలు-2500, పెసర్లు-1,000 ఎకరాల్లో సాగవుతుందని ప్రణాళికను రూపొందించారు. అయితే గతేడాది వానకాలంలో జిల్లాలో 5.81 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగుకాగా, వరి-1,34,857 ఎకరాలు, మొక్కజొన్న-55,751, జొన్నలు-2033, కందులు-1,31,284, పెసర్లు-13,453, మినుములు-5175, పత్తి-2,30,285 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. మరోవైపు సరిపడా విత్తనాలు, ఎరువులను జిల్లా యంత్రాం గం రైతులకు అందుబాటులో ఉంచింది.
అయితే ఈ ఖరీఫ్‌లో 5,45,000 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు భావించి ఇప్పటికే 3,14,525 ప్యాకెట్ల పత్తి విత్తనాలను నిల్వ చేయగా.. రైతులు 59,458 పత్తి విత్తనాల ప్యాకెట్లను కొనుగోలు చేశారు. అదేవిధంగా వరికి సంబంధించి 27,500 క్వింటాళ్ల విత్తనాలు, మొక్కజొన్న- 4036 క్వింటాళ్లు, పెసర్లు-1040, కందులు-4500 క్వింటాళ్లు, మినుములు-400 క్వింటాళ్లు, సోయాబీన్-750 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో పీఏసీఎస్ డీలర్లు, కంపెనీ గోదాంలు, మార్క్‌ఫెడ్, వ్యవసాయశాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే ఎరువులను సరఫరా చేయాలని నిర్ణయించారు. అన్ని ఎరువులు కలిపి 75, 437 మెట్రిక్ టన్నుల అవసరమని భావిస్తున్నారు. యూరియా-32,329 మెట్రిక్ టన్నులు, డీఏపీ-17,719, కాంప్లెక్స్ ఎరువులు-19,877, ఎంవోపీ-3658 , ఎస్ఎస్పీ-1854 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేసి.. యూరియా-15,317 మెట్రిక్ టన్నులు, డీఏపీ-1273, కాంప్లెక్స్ ఎరువులు -2477, ఎంవోపీ- 192, ఎస్ఎస్పీ- 106 మెట్రిక్ టన్నుల ఎరువులను జిల్లాలోని గోదాముల్లో ఇప్పటికే నిల్వ ఉంచారు.
కురిసిన 31.9 మి.మీటర్ల వర్షపాతం..
సరైన పదును ఉంటేనే విత్తనాలను నాటాలని జిల్లా వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. జిల్లా అంతటా 60 మి.మీటర్లకుపైగా వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనాలను నాటాలని చెబుతున్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు 31.9 మి.మీటర్ల వర్షపాతమే నమోదైంది. అయితే 60మి.మీటర్ల వర్షపాతానికి మించి కేవలం రెండు మండలాల్లోనే వర్షం కురిసింది. అత్యధికంగా కొడంగల్ మండలంలో 116 మి.మీటర్ల వర్షపాతం, బంట్వారం మండలంలో 61.9 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా మండలాలకు సంబంధించి… ధారూరు, పెద్దేముల్ మండలాల్లో 49.2 మి.మీటర్లు, బషీరాబాద్ మండలంలో 48.7, మర్పల్లిలో 45.5, కోట్‌పల్లిలో 42.9, యాలాలలో 31.2, దౌల్తాబాద్‌లో 30.1, పూడూరులో 26.1, దుద్యాలలో 26.8, తాండూరులో 23.2, బొంరాస్‌పేటలో 27.2 , వికారాబాద్‌లో 18.8, పరిగిలో 18.3, చౌడాపూర్‌లో 4.6, మోమిన్‌పేటలో 10, నవాబ్‌పేటలో 4.2, దోమ మండలంలో 3.1 మి.మీటర్ల వర్షపాతం ఇప్పటివరకు నమోదైంది.
తొందర పడొద్దు..
రైతులెవరూ తొందరపడి ఇప్పుడే విత్తనాలను నాటొద్దు. నేలలో సరిపడా తేమ శాతం వచ్చిన తర్వాతే నాటాలి. మరో ఒకట్రెండు మంచి వానలు కురిసిన తర్వాత నాటితే బాగుంటుంది. ఒకవేళ ఇప్పుడే విత్తనాలను నాటితే విత్తనాలు మొలకెత్తదని, మళ్లీ విత్తనాలను నాటాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. వానకాలానికి సంబంధించి సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
– గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి