వికారాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం కష్టించి పంటల ను సాగు చేసే రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, నకిలీ విత్తనాలు ఇలా ఏదో రకంగా అన్నదాత నష్టపోతూనే ఉన్నాడు. ప్రతి ఏటా బాగా పంటలు పండుతాయనే ఆశతో సాగుకు ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఈ ఏటా భారీ వర్షాలతో జిల్లాలో తీవ్రంగా పంట నష్టం జరిగింది.
జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 చొప్పున పరిహారం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా ఇప్పటికీ ఒక్క రైతుకూ నయా పైసా అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు నెలలో నష్టపోయిన పంటలకు సంబంధించి పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి అందించినా ఇంకా రైతులకు పరిహారమే అందలేదు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో కాగ్నా, మూసీ నదులు ఉప్పొంగి ప్రవహించడంతోపాటు వరద ధాటికి పలు మండలాల్లో పంటలు కొట్టుకుపోయాయి. పత్తి ఏరేందుకు సిద్ధమయ్యే సమయంలో అల్పపీడనం రైతులను పూర్తిగా నష్టాల్లో ముంచెత్తింది. జిల్లాలో ఎక్కువగా పత్తి పంటే నీట మునిగింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు.
అలాగే, ఆగస్టులో, సెప్ట్టెంబర్ 26 నుంచి 29 వరకు, అక్టోబర్‌లో వచ్చిన మొంథా తుఫానుతో కురిసిన భారీ వర్షానికి జిల్లాలో 6,641 ఎకరాల్లో ఆయా పంటలకు నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఎక్కువగా పెద్దేముల్, వికారాబాద్, దౌల్తాబాద్, కోట్‌పల్లి, మర్పల్లి, తాండూరు, ధారూరు, పూడూరు, పరిగి, నవాబుపేట మండలాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. నష్టపోయిన పంటల్లోనూ ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలే ఉన్నాయి. భారీ వర్షాలతో జిల్లాలోని 355 గ్రామాల్లో 8,430 మంది రైతులు తమ పంటలను నష్టపోయారు. గతం లో ఎప్పుడు లేని విధంగా పరిగి, దోమ, తాండూరు, వికారాబాద్, మోమిన్‌పేట, నవాబుపేట, పూడూరు, చౌడాపూర్, కులకచర్ల మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో రైతులు పంటలను నష్టపోయారు.