షాబాద్ : అనుమానస్పద స్థితిలో ఓ మహిళ చెరువులో పడి మృతిచెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని బొబ్బిలి గ్రామంలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గు మండలం రేగడి చిల్కమర్రి గ్రామానికి చెందిన నర్సమ్మ(35)నాలుగు రోజుల నుంచి కనిపించకుండపోయింది. దీంతో కుటుంబీకులు చుట్టుపక్కల ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఆదివారం షాబాద్ మండలంలోని బొబ్బిలి గ్రామ సమీపంలోని చెరువులో గుర్తు తెలియని మృతదేహం పైకి తేలడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అనంతరం మహిళ రేగడిచిల్కమర్రికి చెందిన నర్సమ్మగా గుర్తించారు. తన అక్క మృతిపై అనుమానం ఉందని మృతురాలి సోదరుడు మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.