Fourth City | కందుకూరు, మార్చి 20 : రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరిట రైతుల వద్ద బలవంతంగా భూసేకరణ చేస్తుందని సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తెలిపారు. గురువారం మండల కార్యదర్శి బుట్టి బాల్రాజ్తో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2013 చట్టం ప్రకారం బహిరంగ మార్కెట్లో భూమి విలువకు మూడు రెట్లు చెల్లించాల్సి ఉండగా రైతులకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తున్నారు అనేది చెప్పకుండా రైతుల సమ్మతం లేకుండా బలవంతంగా రైతుల నుండి భూసేకరణ చేయడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు. ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూమిలో వేలాది ఎకరాలు రైతులకు కాకుండా బోగస్ పేర్లతో రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు కొల్లగొట్టారని దీనిపైన న్యాయవిచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చి డబ్బులు రికవరీ చేసి అసల్తెన లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వాస్తవంగా భూ సేకరణ చేస్తే రైతులతో మాట్లాడి వారికి సంబంధించిన రేటును ఒప్పించి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులతో సంప్రదించకుండా పోలీసులను పెట్టి రైతులను భయపెట్టి వేలాది ఎకరాల భూమిని ఫోర్త్ సిటీ, కేబుల్ సిటీ యూనివర్సిటీ, స్మార్ట్ సిటీ, త్రిబుల్ ఆర్.. ఇలా రకరకాల పేర్లుతో రైతుల భూములను బలవంతపు భూసేకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఫోర్త్ సిటీ పేరుతో ఎగ్జిట్ 13 నుండి రంగారెడ్డి జిల్లా ఆకుతోటపల్లి వరకు 330 ఫీట్ల రోడ్డును రైతుల నుండి బలవంతంగా సేకరిస్తున్న ప్రభుత్వం రైతుల సమృద్ధి లేకుండానే కోట్ల విలువ చేసే భూములను రూ 60 నుంచి 70 లక్షలు చెల్లిస్తామని రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేస్తుందని దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రైతుల ఇష్ట ప్రకారంగా భూసేకరణ చేయాలి డిమాండ్ చేశారు.
రైతులకు అండగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఈనెల 25వ తేదీన మండల పరిధిలోని ఆకుల మైలారం నుండి అన్నోజిగూడ మీర్ఖాన్పేట్, బేగరి కంచ, కుర్మిద్ద, సాయిరెడ్డి గూడ, ముచ్చర్ల, యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్ గ్రామాల్లో సిపిఎం పార్టీ రైతులను చైతన్య పరచడం కోసం జీపు జాతర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఈనెల 27వ తేదీన ఆయా గ్రామాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యలు రావిచెట్టు చందు, శ్రీశైలం, సాతూరి కృష్ణ, చిర్ర నరసింహ, బుడ్డి రపు శ్రీనివాస్ పాల్గొన్నారు.