యాచారం, మార్చి27: రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని రాక్షస పాలన కొనసాగుతుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పి. అంజయ్య అన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఇంటి స్థలాలకు వెళ్లిన సీపీఎం నాయకుల అక్రమ అరెస్టును, ఫార్మాసిటీ బాధిత రైతులకు అండగా చేపట్టిన సీపీఎం పాదయాత్రకు అనుమతులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. సాగర్-హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నిరసన తెలిపే హక్కుకూడా లేదా అంటూ ఆయన ప్రశ్నించారు.
ఇళ్ల స్థలాల కోసం రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్లిన సీపీఎం నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఫార్మాసిటీ బాధిత రైతులకు న్యాయం చేయాలని చేపట్టిన సీపీఎం పాదయాత్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా రామోజీ ఫిల్మ్‌సిటీలో పేదలకు ఇళ్ల స్థలాలు సాధించి తీరుతామన్నారు. చలో కలెక్టరేట్ పాదయాత్రను చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఇకపై ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జంగయ్య, చందునాయక్, జగన్, విప్లవకుమార్, శ్రీరాములు, శ్రీశైలం, రమేష్, లక్ష్మణ్, రాములు తదితరులున్నారు.