యాచారం, అక్టోబర్3: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజావ్యతిరేఖ విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను చిత్తుగా ఓడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పడగాల యాదయ్య పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పడగాల యాదయ్య మాట్లాడుతూ..ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమ రెండేళ్ల పాలనలో రాష్ర్టానికి ఒరుగబెట్టిందేమిలేదన్నారు.
ప్రజాసమస్యలను గాలికొదిలేసిన రేవంత్ సర్కార్ ప్రతిపక్ష నాయకులను విమర్శించడంపై పెట్టిన శ్రద్ధ రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడంలో మాత్రం చూపడంలేదని విమర్శించారు. సీఎం రేవంత్ ముందు ఎన్నికల ముందిచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలు 420హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రజా సమస్యలను విస్మరించిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. హామీలు నెరవేర్చని పార్టీలకు తమ ఓటు ద్వారా తగిన బుద్ది చేప్పాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు అంజయ్య, బ్రహ్మయ్య, జంగయ్య, చందునాయక్, పెద్దయ్య, వెంకటయ్య, తావునాయక్, జగన్, జంగయ్య, లాజర్, విప్తవకుమార్ తదితరులున్నారు.