మొయినాబాద్, మార్చి04: అర్హులైన పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ప్రజలకు పంపిణీ చేయాలని సీపీఎం పార్టీ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ అన్నారు. సీపీఎం పార్టీ మండల కన్వీనర్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం మంగళవారం మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని అజీజ్‌నగర్ గ్రామంలో ఇంటింటికి తిరిగి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. అజీజ్‌నగర్ గ్రామ రెవెన్యూలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా ఇప్పటి వరకు ఎంపికైన లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్‌లకు ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అజీజ్‌నగర్ గ్రామంలో సాయంత్రం కాగానే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతుందని, దీని వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను నియమించాలని సూచించారు. గ్రామంలో విపరీతంగా దోమల బెడద ఉంటుందని ప్రజలు వాపోతున్నారని అన్నారు. దోమల నివారణకు స్ప్రే చేయాలని లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం చేవెళ్ల డివిజన్ కమిటీ సభ్యులు ఎర్రవల్లి శ్రీనివాస్, అజీజ్‌నగర్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షులు డప్పు మహేందర్, , నాయకులు యేసు, ఉస్మాన్, రాజేందర్, తదితరులు ఉన్నారు.