ఆదిబట్ల, మార్చి 29 : ఇబ్రహీంపట్నం మండలం, నాగన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 189, 203లో నిరుపేదలకు ఇచ్చిన 60 గజాల ఇంటి స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కా రానికి చర్యలు తీసుకోవాలని శనివారం సీపీఎం ఇంటి స్థలాల పోరాట కమిటీ బృందం రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రాన్ని అందజేసింది.
ఈ సందర్భంగా సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. 18 ఏండ్లుగా రామోజీఫిలింసిటీలో పేదలకు కేటాయించిన ఇంటి స్థలాల కోసం పోరాడుతున్నామని తెలిపారు. ఇటీవల చలో రామోజీ ఫిలింసిటీ కార్యక్రమం సందర్భంగా ఇండ్ల స్థలాల వద్దకు లబ్ధిదారులు వెళ్తే వారిని పోలీసులు ఈడ్చుకెళ్లారని, అకారణంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వం కేటాయించిన స్థలాలను తమకు ఇవ్వాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే లబ్ధిదారులు అక్కడికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. పేదల ఇండ్లస్థలాలను రామోజీ యాజమాన్యం అక్రమంగా కబ్జాచేసి వినియోగించుకుంటున్నదని.. అందులోకి ఎవ్వరూ వెళ్లకుండా కందకాలు తీయడంతోపాటు రోడ్డును నిర్మించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల స్థలాలను వెంటనే ఇప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రామోజీ ఫిలింసిటీలోని ఇండ్ల స్థలాల విషయంపై ప్రభుత్వానికి నివేదికను పంపించామని.. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కరం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమం లో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సామేల్, జిల్లా కమిటీ సభ్యులు బుగ్గరాములు, జంగయ్య, జగన్, మండల కమిటీ సభ్యులు ఆనంద్, నర్సింహ, మాజీ ఎంపీటీసీ భిక్షపతి, కృష్ణ, శ్రీనివాస్‌తోపాటు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.