ఆరుగాలం కష్టపడి తెల్లబంగారాన్ని పండించిన రైతు తెల్లబోయిండు.. అప్పుసప్పు చేసి భూమిని చదును చేసి విత్తనాలు, ఎరువులను తెచ్చి సాగు చేస్తే.. ఆరంభంలోనే వరుణుడు షాక్ ఇచ్చిండు.. అంతంత మాత్రంగానే కురిసిన వానలకు చేను ఎదుగకపోవడంతో పత్తి మందులకని మళ్లీ అప్పులు చేసిండు.. పంట చేతికొచ్చాక.. కూలీల కొరత రైతన్నను కలిచివేసింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కూలీలకు కిలో పత్తికి రూ.13 చెల్లించి, వారితోపాటు ఇంటిల్లిపాది కష్టపడి పత్తిని తెంచుకున్నరు. పంట చేతికొచ్చిందని సంబురపడ్డ రైతు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి రోజుల తరబడి నిరీక్షించ లేక దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వక.. అటు దళారులు అగ్గువకే పత్తిని కొనడంతో పత్తి రైతు నిండా మునిగిండు..
– రంగారెడ్డి, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో లక్షా 39 వేల ఎకరాల్లో పత్తి సాగు..
రంగారెడ్డి జిల్లాలో ఈ వానకాలం లక్షా 39 వేల ఎకరాల్లో పత్తి సాగైంది. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్, మహేశ్వరం డివిజన్ పరిధిలోని మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల, యాచారం మండలాలు, షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని కొందుర్గు, షాద్‌నగర్, ఫరుఖ్‌నగర్ మండలాల్లో పత్తి అధికంగా సాగైంది. ఈసారి జిల్లా లక్షా 50వేల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం సీసీఐ ద్వారా 15 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సరైన మద్దతు ఇవ్వకపోవడంతోపాటు పత్తి నల్లబడిందని, తేమ శాతం ఎక్కువగా ఉన్నదని కొర్రీలు పెట్టడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
రోజుల తరబడి నిరీక్షణ..
సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. దళారులు తీసుకెళ్లే పత్తి వాహనాలు మాత్రం నేరుగా కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్తున్నాయన్న ఆరోపణలున్నాయి. తేమ శాతం అధికంగా ఉన్నదని కొర్రీలు పెడుతూ క్వింటాలు పత్తికి రూ. 6900 నుంచి రూ. 7000 చెల్లిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయలేక దళారులకే ఎంతోకొంతకు పత్తిని విక్రయించి నష్టపోతున్నారు. అయితే దళారులు తీసుకెళ్లిన పత్తికి మాత్రం కొనుగోలు కేంద్రాల్లో రూ.7300 చెల్లిస్తుండడం విశేషం. దళారులకు పెద్దపీట వేయడం సరైన పద్ధతి కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ తతంగం జరుగుతున్నదని జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు.
అప్పే మిగిలింది..
18 ఎకరాల్లో పత్తి సాగు చేసినా. పెట్టుబడికి రూ.ఆరు లక్షలు, కూలీలకు మరో రూ.మూడు లక్షలు ఖర్చు అయ్యింది. కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకెళ్లి రోజుల తరబడి పడిగాపులు కాయలేక మధ్య దళారికే క్వింటాల్ రూ.6800లకే పత్తి అమ్మినా. దీంతో అప్పులు మీద పడ్డాయి. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
– తిరుమల్‌రెడ్డి, నల్ల చెరువు, మాడ్గుల మండలం
పత్తి ధర పెంచాలి..
పత్తికి సరైన మద్దతు ధర ఇవ్వాలి. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. ప్రభుత్వం మద్దతు ధరను క్వింటాలుకు రూ.10వేలు ప్రకటించాలి. మాడ్గుల మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో క్వింటాలుకు రూ.9 వేలు ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని రైతులను ఆదుకోవాలి.
– కట్ట రాజు, నల్ల చెరువు