రంగారెడ్డి, ఆగస్టు 19 (నమస్తేతెలంగాణ): రంగారెడ్డిజిల్లాలోని రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భూభారతి ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండగా…మరోవైపు ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. ఫైళ్లు కదలాలంటే…పైసలు ఇవ్వాల్సిందే.. పైసలు ఇచ్చుకోలేక కొందరు ఏసీబీని ఆశ్రయించి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. జిల్లాలో ఓవైపు అవినీతి ఏసీబీ దాడులు జరుపుతున్నప్పటికీ మరోవైపు కొందరు అధికారులు లంచాలను డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జిల్లా పరిధిలో భూముల విలువ భారీగా పెరగటంతో ఏ చిన్న పనికైనా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. లంచం ఇవ్వలేని వారి ఫైళ్లు ఏళ్ల తరబడి ముందుకు కదలటంలేదు. దీంతో సామాన్య ప్రజలు పనులు జరుగక అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో పనులు జరుగకపోవటంతో ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధరణిలో పనులు జరిగేవని, భూభారతి వచ్చిన తర్వాత ఒక్క పనికూడా జరగటం లేదని పలువురు వాపోతున్నారు. జిల్లాలోని పలు మండలాలు అవినీతికి కేరాఫ్‌గా మారాయి. జిల్లా పరిధిలోని ఔటర్ చుట్టుప్రక్కల మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్‌సిటీలోకి వెళ్లిన మండలాల్లోని భూములకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ అధికారులు పనులు చేయాలంటే పైసలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.
జిల్లాలో గత రెండు నెలల వ్యవధిలో ఇద్దరు తహసీల్దార్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అలాగే, వారికి సహకరించిన సర్వేయర్, మరో ఆర్ఐ, అటెండర్ కూడా ఏసీబీ వలలో చిక్కుకున్నారు. గత సంవత్సరం జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత గత నెలలో తలకొండపల్లి తహసీల్దార్‌తో పాటు అతనికి సహకరించిన అటెండర్‌ను సైతం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తనతల్లి పేరున ఉన్న భూమిని కొడుకుల పేరుమీదకు మార్చాలని తహసీల్దార్‌ను ఆశ్రయించగా వారు లక్షరూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించగా వారు పట్టుకున్నారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ఆర్ఐ కృష్ణ అవినీతికి పాల్పడి ఏసీబీకి చిక్కారు. ఆదిబట్ల గ్రామంలో నిషేధిత జాబితాలో ఉన్న తమ భూమిని జాబితా నుంచి తొలగించటం కోసం డబ్బులు డిమాండ్ చేయటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడితో ఆర్ఐ మాట్లాడిన సంభాషణ అంతా రికార్డు చేసి ఏసీబీ అధికారులకు అప్పగించటంతో వారు పట్టుకున్నారు. ఈ సంఘటనను మరిచిపోకముందే మంగళవారం ఆమనగల్లు తహసీల్దార్, ఆర్ఐ కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీనికి సంబంధించి రికార్డు మార్పిడి కోసం ఆకుతోటపల్లికి చెందిన బాధిత రైతు ఆర్ఐని ఆశ్రయించాడు. ఆర్ఐ తహసీల్దార్ ఇద్దరు కలిసి బాధితుడిని లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. రూ.50వేలు ఇచ్చిన బాధితులు, మిగతా డబ్బుల కోసం ఒత్తిడి పెరగటంతో ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి తహసీల్దార్ లలిత, సర్వేయర్ రవి పట్టుకున్నారు.
భూభారతిలో భాగంగా కొనసాగుతున్న ఫైళ్ల క్లియరెన్స్‌లో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటుందని పలువురు రైతులు వాపోతున్నారు. భూభారతి ద్వారా సమస్యలన్నీ పరిష్కరిస్తామని అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఫైళ్లు కదలాలంటే పైసలు ఇవ్వక తప్పటంలేదు. దీంతో విసిగిన బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చిన భూభారతి కొంతమంది రెవెన్యూ అధికారులకు వరంగా మారింది. భూభారతిలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ త్వరగా పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశించిన నేపథ్యంలో కిందిస్థాయిలో పెద్దఎత్తున ఫైళ్ల క్లియరెన్స్ పనులు మొదలు పెట్టారు. ఈ పనుల్లో ఫైళ్లు ముందుకు జరగాలంటే పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్లనే అవినీతి భారీగా పెరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.