వికారాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అనేది మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరంలేదు, మూడు గంటల కరెంట్ సరిపోతదని రైతు వ్యతిరేక విధానమే మా నినాదమనే విధంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. రైతులకు పంట పెట్టుబడి నిమిత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న రైతుబంధు సహాయాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది.
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులకు ఎకరాకు రూ.5 వేల రైతుబంధు సాయం జమ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి అడ్డుకున్నది. ఈ మేరకు రైతుబంధు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ లేఖ రాయడంపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. జిల్లా అంతటా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ, రైతుల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు ఆందోళనలు చేశారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ రైతులకు కష్టాలు తప్పవని, రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా, రైతుబీమా తదితర పథకాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తదనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పూర్తిగా తగ్గిన రైతుల ఆత్మహత్యలు.. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు.
రైతుల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని విధంగా అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, 24 గంటల కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలు తదితర పథకాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో రైతులకు శ్రీరామరక్ష అని జిల్లా రైతులు పేర్కొన్నారు. మొదటి నుంచి రైతాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ప్రారంభం నుంచి కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులతో దాదాపు 8 ఏండ్లపాటు పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.