ఆమనగల్లు, జనవరి 18 : రూ.6కోట్లతో అన్ని హంగులతో షాద్‌నగర్, ఆమనగల్లు, శంషాబాద్, షాబాద్, కొత్తూరు, మంచాల మండలాల్లో మోడల్ గ్రంథాలయాలను నిర్మిస్తున్నట్లు జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 400 పాఠశాలల్లో 250 పుస్తకాలతో రీడింగ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లులో రూ.కోటితో నిర్మిస్తున్న మోడల్ గ్రంథాలయ భవన నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కమటం రాధమ్మ, జిల్లా కార్యదర్శి మనోజ్‌కుమార్‌తో కలిసి చైర్మన్ పరిశీలించారు. మార్చి చివరి నాటికి భవన పనులు పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న పనులకు మరో రూ.5 లక్షలు, ప్రహరీ నిర్మాణానికి రూ.15 లక్షలకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. గ్రామీణ నిరుద్యోగ యువత కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో 8 పౌర పఠన మందిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కడ్తాల్ మండలంలో ఎక్వాయిపల్లిలో పౌర పఠన మందిరాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన నేపథ్యంలో రూ.20లక్షలతో కొత్త పుస్తకాల కొనుగోలుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రంథాలయాలను డిజిటలైజ్ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్యామ్‌సుందర్, ఈఈ కుమార్‌గౌడ్, నాయకుడు వెంకటయ్య పాల్గొన్నారు.