రంగారెడ్డి, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక సందర్భంగా అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. బీఆర్ఎస్కు పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చినా అధికార పార్టీ అడ్డదారులు తొక్కి ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. ఇందుకోసం బద్ధ శత్రువైన బీజేపీతో పొత్తుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది.
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు శంకర్ పల్లి, చేవెళ్ల, షాద్‌నగర్ మున్సిపాలిటీల్లో మాత్రమే స్పష్టమైన మెజార్టీ రాగా.. ఇబ్రహీం పట్నం, మొయినాబాద్, ఆమనగల్లు మున్సిపాలిటీల్లో ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారు. కానీ, కాంగ్రెస్‌పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి.. షాద్‌నగర్, శంకర్పల్లి, మొయినా బాద్ మున్సిపాలిటీలను బీజేపీ, ఇండిపెండెంట్ల మద్దతుతో చైర్మన్, వైస్‌చైర్మన్ పీఠాలను దక్కించుకున్నది. ఇందుకోసం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసిందన్న ఆరోపణలున్నాయి. మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 వార్డులుండగా.. ఇక్కడ బీఆర్ఎస్ ఏడు వార్డుల్లో, కాంగ్రెస్-10, బీజేపీ-4, స్వతంత్రులు-5 వార్డుల్లో గెలిచారు. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 15 మంది కౌన్సిలర్లు అవసరం.
కాగా, స్వతంత్రుల మద్దతు తో చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకున్నది. మరోవైపు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన అజీజ్‌నగర్ కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేశారు. అలాగే, ఇక్కడ ఐదుగురు బీజేపీ, బీఆర్ఎస్, రెబెల్ అభ్యర్థులు గెలవగా వారు కూడా కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చారు. కాగా, చిల్కూరు కౌన్సిలర్ రాజుకు వైస్‌చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఎన్కేపల్లి నుంచి గెలుపొందిన బీజేపీ రెబెల్ అభ్యర్థి మహేశ్కూడా కాంగ్రెస్‌కే మద్దతు ప్రకటించారు. ఇబ్రహీంపట్నంలో అధికార దుర్వినియోగం..

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా పలు కారణాలను చూపుతూ అధికారులు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. ఈ మున్సిపాలిటీలో 24 వార్డులుండగా.. బీఆర్ఎస్ పార్టీ 13 వార్డుల్లో గెలుపొం దింది. బీఆర్ఎస్కు స్వతంత్ర అభ్యర్థితోపాటు బీజేపీ అభ్యర్థి కూడా మద్దతు ఇవ్వడంతో సంఖ్య బలం 15కు చేరింది. కాగా, ఇందులో సీనియర్ కౌన్సిలర్ యాదగిరి ప్రమాణ స్వీకా రానికి గైర్హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారానికి 14 మంది సభ్యుల మద్దతు ఉన్నా ఉద్రిక్త పరిస్థితులను సాకుగా చూపి అధికారులు మంగళవారానికి వాయిదా వేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధికారులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా సమావేశ మందిరంలో కూర్చున్న కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయటమే కాకుండా సజావుగా సాగే చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కూడా కాకుండానే ప్రజల్లోవ్యతిరేకత పెల్లుబుకుతున్నది. ఇందుకు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పది మున్సిపాలిటీలుండగా..ఐదింటిలో సగానికి తక్కువ స్థానాల్లో హస్తం పార్టీ గెలుపొందింది.

ఆమనగల్లులో కేవలం ఒకే ఒక్క వార్డులో అధికార పార్టీ గెలుపొందడం..రేవంత్ సర్కార్‌పై ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తున్నది. కాగా, ప్రజల తీర్పును తారుమారు చేస్తూ మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను సాధించేందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని రకాల అక్రమాలకు తెరతీసింది.
వికారాబాద్, పరిగి మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ చేరకున్నా చైర్మన్ పీఠాలను హస్తగతం చేసుకున్నది. రంగారెడ్డి జిల్లాలో ని ఆమనగల్లు, మొయినాబాద్ మున్సిపాలిటీల్లో తక్కువ వార్డులను గెలిచి నా బద్ధ శత్రువైన బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని సాధించింది. బీఆర్ఎస్ పూర్తి మెజార్టీ సాధించినా ఇబ్రహీంపట్నంలో నానా రభస చేసి చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించింది. ఓటమిని అంగీకరించలేక ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతు న్నాయి.