షాబాద్/చేవెళ్ల రూరల్, ఫిబ్రవరి 5 : రెండేండ్లలో ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువా రం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లోని 5, 6, 7, 8 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కొత్త మాణిక్‌రెడ్డి, శంకరయ్య, మల్లారెడ్డి, మాణిక్యం, ఎనికెపల్లిలో 9, 11 వార్డుల్లో సురేశ్, సునీల్‌కు మద్దతుగా .. అలాగే, గురువారం సాయంత్రం చేవెళ్ల మున్సిపల్ పరిధి ఇబ్రహీంపల్లి, పామెన వార్డుల్లో కారు గుర్తుకు ఓటేయాలని మాజీ మంత్రి సబితారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ హయాం లో కేసీఆర్ ఏం చేసిండు..రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్‌రెడ్డి ఏం చేసిండో ప్రజలు ఆలోచించాలన్నారు. తాగునీటి కోసం ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని రోడ్లపైకి వెళ్తే పరువుపోతుందని, మగవాళ్లు తలవొంచుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఇంటింటికీ నల్లానీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. నల్లా నీళ్లు ఇచ్చేవరకు ఓట్లు అడగనని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని అ న్నారు. హైదరాబాద్‌లో ప్రజలు ఏ నీరు తాగుతున్నారో.. గ్రామాల్లోనూ ప్రజలు ఆ నీటినే తాగేలా కృషి చేశారన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో 420 హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయకుండా స ర్కార్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని.. మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో పంటలకు అదునుకు ఎకరాకు రూ.10 వేల రైతు బంధు డబ్బులు అందించారని, ప్రస్తుత ప్రభుత్వం మూడుసార్లు రైతు బంధు డబ్బులు ఎగ్గొంటిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తామని చెప్పి, పెళ్లి చేసుకుని బిడ్డ పుట్టిన తర్వాత అదే కేసీఆర్ ఇచ్చిన రూ.లక్ష ఇస్తున్నారని మండిపడ్డారు. అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రైతులు సాగు చేసుకునే అసైన్డ్ భూములను గుంజుకుని వాళ్లకు జీవనాధారం లేకుండా చేస్తున్నదన్నారు.
గండిపేట్ చౌరస్తాలో సర్వే నం.176లోని 50 ఎకరాల భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇవ్వరాదని సూచించారు. పాలన చేయడం చేతగాక, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములు అమ్ముకుని పరిపాలన కొనసాగిస్తున్నదన్నారు. ఏమనంటే మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మగవారి వద్ద డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నదని మండిపడ్డారు. రైతు బిడ్డగా రైతుల సంక్షేమానికి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అండగా నిలిస్తే, రేవంత్‌రెడ్డి మాత్రం అన్నదాతలను ఎరువుల కోసం క్యూలో నిలబెట్టి, చెప్పులు లైన్లో పెట్టే దుస్థితికి తీసుకువచ్చారన్నారు.
ఏం అభివృద్ధి చేశారని కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగేందుకు వస్తున్నారో ప్రశ్నించాలని సూచించారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఎక్కడ పాయె, పింఛన్ల పెంపు ఏది, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎక్కడ పోయాయని నిలదీయాలని తెలిపారు. గ్రామాల్లో ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని, రెండేండ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జీలు జయసింహ, అమృత్రావ్చౌహాన్, చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమోళ్ల ఆంజనేయులు, పార్టీ రాష్ట్ర నాయకులు అనంతరెడ్డి, నర్సింహారెడ్డి, నరోత్తంరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్నసతీశ్, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ లావణ్య, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రెండేండ్లలో వచ్చేది
తెలంగాణలో రెండేండ్లలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందని సబితారెడ్డి అన్నారు. మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్, ఎనికేపల్లి గ్రామాల్లో బీఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 100 మంది నాయకులు సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా విసుగు చెందారని తెలిపారు. అమలు కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. గ్రామాల్లో ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు రావడం జరుగుతుందన్నారు.
చేవెళ్ల రూరల్ : ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చిన మోసపూరిత కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని సబితారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సాయంత్రం చేవెళ్ల మున్సిపల్ పరిధి ఇబ్రహీంపల్లి, పామెన వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలిచ్చి వాటి అమలులో విఫలమైన రేవంత్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి సున్నానేనని పేర్కొన్నారు. నమ్మి ఓటేసిన ప్రజలను రేవంత్ సర్కార్ నిండా ముంచిందని, కాంగ్రెస్ ప్రజలకు ఉన్న బాకీని కార్డు రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి, ఇచ్చిన హామీలను గాలికొదిలేసి అసలు ఏం మొహం పెట్టుకొని కాంగ్రెస్ ఓట్లు అడగడానికి వస్తున్నదో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కోవడమే తప్పా సంతోషంగా లేరని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనను ఆదర్శంగా తీసుకొని చేవెళ్ల మున్సిపల్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు.
ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మహ్మద్ జాహేద్, చాకలిగూడెం పాండు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి ఆంజనేయులు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు జంగారెడ్డి, మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్‌రెడ్డి, రామాగౌడ్, దశరథ్, సత్యనారాయణ గౌడ్, ఎల్లయ్య, దాతర్, నజీర్, యాసీన్, నయీం, సలీమ్, సాయి ఉన్నారు