సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): అధికార బలంతో కాంగ్రెస్ .. ఉప ఎన్నికను అభాసుపాలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లుగా వ్యవహరించింది. గెలుపు కోసం వెంపర్లాడుతూ నిబంధనలను కాలరాసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం తారా స్థాయికి చేరింది. నియమావళి తమకు వర్తించదన్నట్లుగా వ్యవహరించిన పోలింగ్ డే రోజున బీఆర్ఎస్పై ఆంక్షలు విధించింది. అన్ని బూత్‌ల వద్ద జరుగుతున్న అక్రమాలను నిలువరించకకుండా అడ్డుకోగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు నిబంధనలు అతిక్రమించి నియోజకవర్గంలోనే తిరుగుతున్న పట్టించుకోలేదు. అసలు ఎన్నికల అధికారులు కూడా అవేవి పట్టనట్లుగా వ్యవహరించారు. నెలరోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ రెండ్రోజులుగా యథేచ్ఛగా డబ్బుల పంపిణీకి తెగబడింది.
ఇంటింటికీ వెళ్తూ రాత్రి పగలు అనే తేడా లేకుండా ఓటర్లకు డబ్బులను పంపిణీ చేసింది. గెలుపు మీద నమ్మకం కుదరకపోవడంతో మంగళవారం పోలింగ్ కేంద్రాల వద్దనే డబ్బులు పంచారు. రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్, కార్మికనగర్, యూసుఫ్‌గూడ డివిజన్లోని కృష్ణానగర్, ఎల్ఎన్నగర్, బోరబండ డివిజన్ పరిధిలోని సైట్ -3, అన్నానగర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు దర్జాగా డబ్బులు పంపిణీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు కూడా డబ్బుల పంపిణీని అడ్డుకునే యత్నం చేయకపోవడంతో సాయంత్రం దాకా పోలింగ్ కేంద్రాల వద్దే డబ్బులను అందజేశారు. పోలింగ్ కేంద్రాల వద్దకు డబ్బులు తరలించేందుకు కాంగ్రెస్ నాయకులు బిర్యానీ పొట్లాలను వినియోగించారు. ఓటు వేసేందుకు వచ్చిన వారు తమకు డబ్బులు రాలేదని చెప్పగానే అక్కడున్న కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు ఓటర్ స్లిప్‌ను పరిశీలించి డబ్బులు ఇవ్వడం కనిపించింది.
నియోజకవర్గంలోనే కాంగ్రెస్ నేతలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అక్రమాలకు పాల్పడేందుకు నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెం 10(సీ)లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో అధికారపార్టీ నేతలు తిష్ట వేశారు. మంత్రి సీతక్కతోపాటు పలువురు కాంగ్రెస్ పెద్దలు ఎంపీ ఎమ్మెల్యే కాలనీ క్లబ్‌తో పాటు కాంగ్రెస్ నేతలు కొలన్ హనుమంత్‌రెడ్డి, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎంపీ మల్లురవి తదితర నేతల నివాసాలను కేంద్రంగా చేసుకుని రెండ్రోజులుగా డబ్బుల పంపిణీని పర్యవేక్షించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేత సింగిరెడ్డి రోహిణ్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం నియోజకవర్గంలో యథేచ్ఛగా తిరుగుతూ డబ్బుల పంపిణీని పర్యవేక్షించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం డబ్బుల పంపిణీ వ్యవహారం కొనసాగిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
మరో మంత్రి దామోదర రాజనర్సింహ నియోజకవర్గంలోని పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించగా, సీతక్క అనుచరులు, పొంగులేటి అనుచరులు కూడా పరిధిలో సాయంత్రం వరకు విడిచిపెట్టలేదు. ఉదయం నుంచే బూత్‌లకు చేరుకున్న కాంగ్రెస్ నేతలు నిబంధనలను తుంగలో తొక్కి..స్థానికేతర నాయకులు సంచరించారు. బోరబండలో నడిరోడ్డుపై డబ్బులు పంపిణీ గురించి డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ చర్చించగా..నెంబర్ ప్లేట్ లేని వాహనాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హల్చల్ చేశారు. బోరబండ ప్రొఫెసర్ జయశంకర్ కమ్యూనిటీ హాల్ వద్ద సిగరెట్ తాగిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వీడియో చర్చనీయాంశంగా మారింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఉదయాన్నే చేరుకున్న కాంగ్రెస్ నేతలను కనీసం స్థానికులు కాదని బీఆర్ఎస్ కార్యకర్తలు వాదించిన ఎన్నికల అధికారులు పట్టించుకోలేదు. సోమాజిగూడలోని ఎల్లారెడ్డిగూడ, ఎన్టీఆర్ నగర్,ఆర్బీఐ కాలనీల్లో బైక్‌పై తిరుగుతూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాత్రంతా తిరిగారు. గడువు ముగిసినా, నియోజకవర్గంలో తిష్టవేశారు. సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్ వెంగల్రావు నగర్ పోలింగ్ బూత్ 79 వద్ద గంటకు పైగా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఏకంగా రహమత్ నగర్ పోలింగ్ కేంద్రం కూర్చోని ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. ఓటు లేని వ్యక్తి పోలింగ్ కేంద్రం వద్దనే ఉన్నారని చెప్పినా.. అధికారులు పట్టించుకోలేదు. ఇక సిద్ధార్థ్ నగర్ బూత్ నెంబర్ 120 వద్ద భారీ కాన్వాయ్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందనే విషయాన్ని మరిచి ఓటర్లను ప్రభావితం చేసేలా బూత్‌లను సందర్శించారు.
ఇంటింటికీ చీరల పంపిణీ..
మూడురోజులుగా నియోజకవర్గంలో నోట్లతో ఓట్లు కొనేందుకు ప్రయత్నించిన అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మహిళలను బుట్టలో వేసుకునేందుకు చీరల పంపిణీని చేపట్టింది. రెండ్రోజుల క్రితం యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లో శ్రీనివాస కల్యాణం నిర్వహించిన కాంగ్రెస్ నేతలు సుమారు లక్ష చీరలు పంపిణీ చేయాలని భావించారు. అయితే పెద్ద సంఖ్యలో జనం రావడంతో వ్యవహారం మొత్తం బయటకు రావడంతో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ నేతలు సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం దాకా ఇంటింటికీ వెళ్లి చీరలను పంపిణీ చేశారు. వెంకటగిరి, కృష్ణానగర్‌లో చీరలను పంపిణీ చేయగా పక్కనున్న ఎల్‌ఎన్‌నగర్‌లో తమకు చీరలు రాలేదని స్థానిక నేతలను నిలదీయడం కనిపించింది.
కాంగ్రెస్ టీషర్టులతో యువత హల్చల్
నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెంబర్ 2ను సూచించేలా టీ షర్టులు వేసుకున్న కొందరు యువకులు హల్చల్ చేశారు. యువ శకానికి పట్టం అంటూ కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన టీ షర్టులను ధరించి నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ల వద్ద సంచరించారు. ఈ విషయంలో స్థానిక బీఆర్ఎస్ నేతలు పోలీసులను ప్రశ్నించిన ఫలితం లేకుండా పోయింది. కనీసం టీషర్టు వేసుకున్న యువకులను అక్కడి నుంచి తరలించకుండా, టీ షర్టులు తొలగించాలని కూడా అధికారులు వారించలేదంటే… కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సిబ్బంది సహకారం ఏ స్థాయిలో ఉందనే విషయం అర్థమైపోతుంది.
అధికార బలంతో బెదిరింపులు..
అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సిబ్బందిని పనిచేయకుండా చేసిందనేలా నియోజకవర్గంలో పదుల సంఖ్యలో జరిగిన ఘటనలే ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నికలకు రాత్రి నుంచే ప్రలోభాలకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ, నిబంధనలు ఉన్నాయనే విషయాన్ని మరిచిపోయింది. అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద కాంగ్రెస్ బలగాలను మోహరించినట్లుగా, స్థానిక నేతల అవతారమెత్తారు. చివరకు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ పోలింగ్ కేంద్రాలను సందర్శించకుండా పోలీసులు అడ్డుకున్నారు. బిర్యానీ ప్యాకెట్ల కింద, ఓటర్ స్లిప్పుల మాటున జరుగుతున్న పంపిణీని బయటపెట్టిన అటు ఎన్నికల అధికారులు, ఇటు పోలీసులు కళ్లు ఉండి చూడలేకపోయారు. కనీసం అభ్యర్థిని పోలింగ్ కేంద్రాలను సందర్శించేందుకు అనుమతి ఇవ్వకుండా రోడ్డుపైనే అడ్డుకున్నారు. చివరకు పోలీసులను ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారు.
నిబంధనలకు పాతరేసిన నేతలు..
ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదు. అయితే అధికార పార్టీ నేతలు ఈ నిబంధనకు పాతరేశారు. ఓటు వేసేందుకు వస్తున్న వారిని పోలింగ్ కేంద్రం లోపలి దాకా వెంబడి వస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ ఒత్తిడి చేయడం కనిపించింది. దీనికి తోడు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఒక్కొ పార్టీకి సంబంధించిన ఒకటి లేదా రెండు టేబుళ్లను మాత్రమే వేసేందుకు అనుమతి ఉంటుంది. అయితే అధికార కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ నిబంధనను తుంగలో తొక్కి ఒక్కో కేంద్రం వద్ద ఐదారు టేబుళ్లను ఏర్పాటు చేసి ఓటేసేందుకు వెళ్తున్న వారిని ప్రలోభాలకు గురిచేయడం కనిపించింది.
బీఎల్వోల తప్పిదం.. కాంగ్రెస్‌కు ఊతం
ఎన్నికల నేపథ్యంలో 15 రోజుల ముందుగానే ఓటర్ స్లిప్పులను బీఎల్వోలు ఇంటింటికీ చేరవేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్లుగా వ్యవహరించిన ఎన్నికల యంత్రాంగం అలసత్వం వహించింది. వాళ్ల చేతుల మీదుగా వెళ్లాల్సిన ఓటర్ స్లిప్పులు కాంగ్రెస్ కార్యకర్తల చేతికి చిక్కాయి. దీంతో ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి ఇదే సాకుగా విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా వ్యవహరించారు. బిర్యానీ ప్యాకెట్ల మాటున డబ్బుల పంపిణీ సాగుతుందనీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతోపాటు, బీఆర్ఎస్ కార్యకర్తలు నిలువరించిన అధికారులు పట్టించుకోలేదు.