నవాబుపేట, ఏప్రిల్ 29 : తమకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఫోన్ చేసి దుర్భాషలాడాడని.. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకే చెందిన నవాబుపేట మండల అధ్యక్షుడు వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి, యూత్ అధ్యక్షుడు శేఖర్ వేర్వేరుగా మంగళవారం పోలీస్స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మండలంలో నిర్వహించిన భూ భారతి కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఫోన్ చేసి ఎమ్మెల్యే మాట్లాడారన్నారు.
‘మీ పదవులు పోతాయి.. గ్రూప్లో ఏమి పోస్టులు పెడుతున్నావ్ బిడ్డా..’ అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారన్నారు. ‘మీ అంతు చూస్తా’ అంటూ అసభ్య పదజాలంతో దూషించారన్నారు. ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. అసభ్యంగా మాట్లాడి అవమానపరిచిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినవారిలో సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, ఆనందం, సంగమేశ్, సదానంద్, లక్ష్మణ్, రాములు, మల్లేశం, గోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. ఇప్పటికే చేవెళ్ల కాంగ్రెస్ రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటుండగా.. ఈ సంఘటనతో అవి మరోసారి బయటపడ్డాయి.