షాద్‌నగర్‌రూరల్, ఆగస్టు 9 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మరో పక్క విపరీతమైన చార్జీల భారం మోపుతున్నది. రెండు నెలల క్రితం ఇటు ప్రభుత్వంకానీ, అటు ఆర్టీసీ సంస్థకానీ ఎలాంటి ముందస్తు ప్రకటన ఇవ్వకుండానే చార్జీలు పెంచేసింది. షాద్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు రూ.70 ఉన్న బస్సు చార్జీని గుట్టుచప్పుడు కాకుండా రూ.80 పెంచేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులను ఆర్టీసీ ‘స్పెషల్’ దోపిడీ చేసింది.
డిపోల నుంచి నిత్యం తిరుగుతున్న పల్లె వెలుగు బస్సులకు ‘స్పెషల్’ స్టిక్కర్ అంటించి దోపిడీకి పాల్పడింది. షాద్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు రోజూ నడిచే బస్సులకు సైతం స్పెషల్ అంటూ ముక్కుపిండి రూ.110 వసూలు చేశారు. పండుగ రోజున మహిళలు తమ పిల్లలను తీసుకొని అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టేందుకు కుటుంబసమేతంగా వెళ్లగా స్పెషల్ చార్జీల పేరిట లూటీ చేశారు. కిలోమీటరుకు రూపాయి చొప్పున వసూలు చేశారు. ఇదిలాఉండగా గ్రామాలకు వెళ్లాల్సిన పల్లె వెలుగు బస్సులన్నిటినీ రద్దు చేశారు. పలు గ్రామాలకు వెళ్లాల్సిన పల్లె వెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు పెట్టడంతో పాటు వాటికి సైతం ‘రాఖీ పౌర్ణమి స్పెషల్’ బస్సులుగా మార్చి ప్రయాణికులను నిలువుదోపిడీకి గురిచేశారు.
పల్లె వెలుగు బస్సులను రద్దు చేయడంతో గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాఖీ కట్టేందుకు వచ్చిన మహిళలు బస్టాండుల్లో బస్సుల కోసం గంటల తరబడి వేచిచూశారు. చావు కబురు చల్లగా చెప్పినట్లు గ్రామాలకు వెళ్లే బస్సులను రద్దు చేసినట్లు ఆర్టీసీ సిబ్బంది తెలుపడంతో వారితో వాగ్వాదానికి దిగారు. ఉన్న బస్సులను రద్దు చేసి పట్టణాలకు పంపిస్తే మా పరిస్థితి ఏంటని ఆర్టీసీ సిబ్బందిని నిలదీశారు. చేసేదేమీ లేక ప్రభుత్వ తీరుపై శాపనార్థాలు పెట్టి అక్కడి నుంచి మహిళలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.
కేవలం రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్పెషల్ బస్సులను నడిపించాం. స్పెషల్ బస్సులకు టికెట్ ధరను పెంచాం. షాద్‌నగర్ డిపో నుంచి తిరుపతి, జూరాల, శ్రీశైలం, మక్తల్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నియోజక వర్గంలోని గ్రామాలకు రెగ్యులర్‌గా 84 బస్సులను నడుపుతున్నాం. ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా మరో 12 స్పెషల్ బస్సులతోపాటు కొన్ని గ్రామాలకు వెళ్లే బస్సులను స్పెషల్ బస్సులుగా ఉపయోగించాం. ప్రయాణికుల రద్దీని బట్టి మరో రెండు రోజులు స్పెషల్ బస్సులను నడుపుతాం.
– ఉష, డిపో మేనేజర్ ఇదేమి దోపిడీ
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు అంటూనే పండుగల సమయంలో బస్సు టికెట్ ధరలను పెంచి సామాన్య ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నది. రాఖీ పండుగ పేరిట రెగ్యులర్ బస్సులను సైతం స్పెషల్ బస్సులు అంటూ అధిక ధరలను వసూలు చేయడం సరికాదు. షాద్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు రూ.110 వసూలు చేశారు. ఇదిలా ఉంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పల్లెవెలుగు రెగ్యులర్ బస్సులను రద్దు చేసి స్పెషల్ బస్సులుగా నడిపించడంతో గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి.
– సునీల్‌రెడ్డి, వెలిజర్ల గ్రామస్తుడు