వికారాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డిని ఓటమి భయం వెంటాడుతున్నది. రంజిత్‌రెడ్డి ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి నిరసనలు, నిలదీతలే ఎదురవుతున్నాయి. సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ఆయన అయోమయంలో పడిపోయారు. ఎంపీని చేసి గుర్తింపు తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన రంజిత్‌రెడ్డికి జనం చుక్కలు చూపిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో గ్రామీణ ప్రాంతంపై దృష్టి సారించారు. ఇక్కడ కూడా సొంత పార్టీ నాయకులు బాహాటంగానే నిరసన వ్యక్తం చేస్తూ రంజిత్‌రెడ్డికి చెమటలు పట్టిస్తున్నారు.
తన మనుషులతో చేపించుకుంటున్న సర్వేల్లో తానే గెలుస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న రంజిత్‌రెడ్డి అండ్ టీంకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న నిరసనలు మింగుడుపడడం లేదు. ఎంపీగా ఉండి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి నయా పైసా పనిచేయని రంజిత్‌రెడ్డిపై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కేవలం డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థికి సొంత పార్టీ నేతలే పార్లమెంట్ ఎన్నికల్లో చేయి ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలుపునకు పనిచేసిన ఎంపీ రంజిత్‌రెడ్డి మూడు నెలలకే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండడం ప్రజలు జీర్ణించుకోవడం లేదు.
రంజిత్ రెడ్డికి ఇటు ప్రజల నుంచి, అటు సొంత క్యాడర్ నుంచి చేదు అనుభవం తప్పడం లేదు. ఏ నియోజకవర్గానికెళ్లినా అడుగడుగునా నిలదీతలే ఎదురవుతున్నాయి. మొన్న వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జరిగిన చేదు అనుభవం మరవక ముందే.. నిన్న తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలో చుక్కెదురైంది. అనామకుడిని ఎంపీగా చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారానికి రావడంపై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలదీశారు. ‘ఎంపీగా ఉండి ఏం చేశావ్, బషీరాబాద్‌లో ఒక్క ఎక్స్‌ప్రెస్ రైలు ఆపించలేకపోయావ్.. మాట్లాడేందుకు వస్తే కూడా పట్టించుకోలేదు.. డౌన్ డౌన్ రంజిత్ రెడ్డి’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
బషీరాబాద్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని 25 రోజులు దీక్ష చేస్తే ఎంపీగా ఉన్న రంజిత్‌రెడ్డి పట్టించుకోకుండా స్థానికుల గొంతు నొక్కేందుకు ప్రయత్నించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజిత్‌రెడ్డి లాంటి నాయకులకు ఓటేసి గెలిపిస్తే ప్రతిరోజూ మనకు అవమానమే అంటూ బషీరాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు ఘూటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మీరు ఎట్లా గెలుస్తారో మేం చూస్తామని రంజిత్‌రెడ్డిని ఉద్దేశించి సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవల వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలోనూ రంజిత్‌రెడ్డికి చేదు అనుభవం తప్పలేదు.
‘ప్రసాద్‌కుమార్‌ను ఓడించేందుకు పనిచేసిన మీ గెలుపు కోసం మేం పనిచేయలేమని, మాపై కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందిపెట్టింది ఇంకా మరువలేదని, రంజిత్‌రెడ్డి కోసం పనిచేయడం మా వల్లకాదంటూ’ కాంగ్రెస్ నాయకుడు, స్పీకర్ ప్రసాద్‌కుమార్ ముందే తెగేసి చెప్పడం గమనార్హం. ఒకరిద్దరూ నాయకులు అయితే అసభ్యపదజాలంతో మాట్లాడినట్లు జిల్లా అంతటా జోరుగా ప్రచారం జరుగుతున్నది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంటింటికెళ్లి పనిచేయాలంటూ రంజిత్‌రెడ్డి బతిమిలాడి ప్యాకేజీలిచ్చినా కాంగ్రెస్ నాయకులు మాత్రం పైకి మీ గెలుపు కోసం పనిచేస్తామని చెబుతున్నా…లోలోపల మాత్రం రంజిత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రంజిత్‌రెడ్డిని వేరే పార్టీలు కాదు సొంత పార్టీ నేతలే ఓడించడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.