Pharma City | రంగారెడ్డి, ఫిబ్రవరి 8 (నమస్తేతెలంగాణ) : ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం జరిగిన ధర్నాలో రైతులకు సంఘీభావం ప్రకటించారు.
యాచారం మండలంలో ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులు సుమారు వెయ్యి మంది వరకు తమ 2,200ఎకరాలను ఫార్మా సిటీకి ఇవ్వమని తెలియచెప్పారు. అలాగే, తమ భూములను బలవంతంగా లాక్కోవద్దని కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి రైతులను కలెక్టర్రేట్కు శనివారం రావాల్సిందిగా నోటీసులు జారీచేశారు. నోటీసులు అందుకున్న నాలుగు గ్రామాల రైతులంతా పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
గ్రామాల్లోని బాధిత రైతులంతా ఏకమవుతుండటంతో వచ్చే ఎన్నికల్లో వారి మద్దతు అవసరమని భావించిన కాంగ్రెస్ నాయకులు రైతులకు సంఘీభావం తెలిపారు. యాచారం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వచ్చిన రైతులకు వారు వెన్నంటి ఉన్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ధర్నాలో కూడా యాచారం మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, యాచారం మాజీ వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, నానక్‌నగర్ మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న రైతులు ఓవైపు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు కూడా అదే ధర్నాలో పాల్గొనడం గమనార్హం.
గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో పర్యటించి పార్మాసిటీ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితిలో పట్టా భూములు తీసుకోనివ్వమని, పట్టా భూములు తీసుకోవడానికి నిర్ణయించిన ప్రభుత్వం ఆ భూములను తిరిగి రైతులకే ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతుల భూములను బలవంతంగా వారికి తెలియకుండానే ప్రభుత్వం పేరున మార్పించి నిషేధిత జాబితాలో పొందుపర్చారు. ప్రభుత్వం నిషేధిత జాబితా నుంచి ప్రభుత్వం పేరును తొలగించి రైతుల పేరును ఎక్కిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు తమవైపు రావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ధర్నాలో కాంగ్రెస్ నాయకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.