సర్పంచ్ ఎన్నికల వేళ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ పార్టీ హామీలను సక్రమంగా నెరవేర్చకపోవడంతోపాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కొర్రీలు పెట్టడంతో చాలామంది ప్రజలు, మహిళలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
బడంగ్‌పేట, డిసెంబర్ 4 : మార్పు తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలనే మోసం చేస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. గురువారం బాలాపూర్ మండలంలోని 18వ డివిజన్ షరీఫ్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహ్మద్ రియాజ్, మహ్మద్ అక్విల్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి తూట్లు పొడు స్తున్నదని ఆరోపించారు.
మార్పు తీసుకొస్తామని ప్రజలనే మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక వర్గమూ సంతోషంగా లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతోనే పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అఖిల్ పాషా, నషీరుద్దీన్, ఫజిల్, మహ్మద్ ఖాసీం, అబేద్, నదీమ్, నవాబ్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.