కొడంగల్, అక్టోబర్ 9 : కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సీఎం అయినాక మమ్మల్ని నాశనం చేస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా బాధిత రైతులకు అండగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మహా పాదయాత్ర తలపెట్టగా.. ముందుగా పోలెపల్లి ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతులు పోలీసుల అడ్డును తప్పించుకొని ఆలయ ప్రాంగణానికి చేరుకొన్నారు.
అనంతరం 5 గ్రామాల ఫార్మా భూ బాధితులతో కలిసి దుద్యాల వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, పలువురు రైతులు మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయం.., భూములు పోతే ఎలా బతుకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఏ కష్టం రాలె.. అని తలచుకొంటూ బాధపడ్డారు. రేవంత్‌రెడ్డి సీఎం అయితే కొడంగల్‌కు మహర్దశ పడుతుందని ఆశ పడ్డం.. 10 నెలల్లోనే హరిగోస పెడుతుండంటూ మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఫార్మాతో ఊర్లు నాశనం..
ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే కాలుష్యంతో కొన్ని ఊళ్లు నాశనమవుతాయి.. కనీసం తాగేందుకు నీళ్లు కూడా దొరుకవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చని పంట పొలాల్లో ఫార్మా కంపెనీలంటూ చిచ్చు పెట్టడం సమంజసం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ ప్రజలు సీఎం పదవిని అంటగడితే.. అందుకు బహుమానంగా కాలుష్యాన్ని అంటగడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
కొండారెడ్డి పల్లిలో..
రేవంత్‌రెడ్డి పుట్టిన ప్రాంతం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఫార్మా కంపెనీలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. అక్కడి ప్రజలు బాగుండాలే.. మేము ఆగం కావాలని సీఎం చూస్తున్నారని మండిపడ్డారు.
బాధలు తెలిపేందుకు వస్తే.. అరెస్టులా..
మా బాధలు చెప్పుకునేందుకు పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం ఏమిటని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత భావ స్వేచ్ఛ హరించుకుపోయిందన్నారు. రైతుల మీదకు వందలాది మంది పోలీసులను పంపించడం దుర్మార్గమన్నారు. రైతులు, మహిళలు అని చూడకుండా అరెస్టులు చేసి ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తే.. ఉప్పెనలా ఉద్యమిస్తామని, ఆత్మబలిదానాలకైనా సిద్ధమని హెచ్చరించారు.
హకీంపేటలో ఉధ్రిక్తత ..
ఫార్మా కంపెనీల ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న రైతుల పక్షాన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మహా పాదయాత్రకు బయలుదేరారు. దీంతో ప్రభుత్వం పోలీసులకు ముందస్తుగా ఆదేశాలు జారీ చేసి ఎక్కడి వారిని అక్కడ అరెస్ట్‌లు చేసేలా చర్యలు తీసుకొన్నది. ఇందులో భాగంగా బొంరాస్‌పేట మండల పరిధిలోని తుంకిమెట్ల ప్రాంతంలో మహా పాదయాత్రలో పాల్గొనేందుకు వస్తున్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు హకీంపేట కూడలిలో పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్యాసం రామకృష్ణ, దౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ తదితరులు మాట్లాడారు. రైతులకు మద్దతు తెలిపేందుకు వస్తున్న వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి ఫార్మా కంపెనీల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం దుద్యాల తహసీల్దార్ వెంకటేశ్ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు.
ఊరు బాగుంటేనే.. మేము బాగుంటాం..
ఊరు బాగుంటేనే మేము బాగుంటాం. ఫార్మా కంపెనీలతో కాలుష్యమైతే ఊరి జనం ఎలా ఉంటారో రేవంత్‌రెడ్డి చెప్పాలి. గతంలో కేసీఆర్ పాలనలో రైతులకు, ప్రజలకు ఏ కష్టం రాలె. రేవంత్ వచ్చాక రైతులను రాసి రంపాన పెడుతుండు. భూములను ఇచ్చేది లేదు. ఏం జరుగుతుందో అందుకు సిద్ధం.
– వెంకటేశ్, పోలెపల్లి, దుద్యాల మండలం, కొడంగల్,
ఊరు విడిచి ఎక్కడికి వెళ్లాలి..
ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం కలుషితమవుతుంది. కనీసం తాగేందుకు నీళ్లు దొరకవు. మేం ఊళ్లను వదిలి వెళ్లాల్సి వస్తది. ప్రజల ఇష్టాలను తెలుసుకోకుండా హైదరాబాద్‌లో ఉండి అంచనాలు వేస్తే ఎలా ?.. ఫార్మా కంపెనీ కాకుండా ప్రజలకు ఉపయోగపడే కంపెనీలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– నారాయణ, పోలెపల్లి, దుద్యాల మండలం, కొడంగల్
భూములను లాక్కుంటే.. సావే శరణ్యం..
వ్యవసాయంతోనే మా బతుకు.. భూములను లాక్కుంటే సావే శరణ్యం. మమ్మల్ని చంపేసి, మా శవాలపై కంపెనీలు కట్టుకోండి. ఉన్న ఎకరం, రెండు ఎకరాల భూమి పోతే ఎట్లా.. బతకాలి. రేవంత్‌కు ఓటేస్తే మా ప్రాణాల మీదికే వచ్చింది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు బాధపడుతున్నాం.
– లక్ష్మీబాయి, లగచెర్ల, దుద్యాల మండలం, కొడంగల్
రైతులను గోస పెడుతుండ్రు..
ఫార్మా కంపెనీ అంటూ రైవంత్రెడ్డి రైతులను గోస పెడుతుండు. దాదాపు 5 వేల మంది రైతులు అకలితో అలమటించాల్సిందే. ఉన్న ఎకరం, రెండు ఎకరాలు పోతే ఏం చేసి బతుకాలి. రైతులు కడుపు మండి, బాధను చెప్పుకునేందుకు వస్తే అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం. అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఎమ్మెల్సీని విడుదల చేయాలి.
– సురేశ్‌రాజ్, లగచెర్ల, దుద్యాల మండలం, కొడంగల్