Congress Party | కేశంపేట, ఫిబ్రవరి 11 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరం రసాభసగా ముగిసింది. పార్టీ పరిశీలకులుగా రఘునాయక్, బాబర్ఖాన్, విశాల శ్రావణ్రెడ్డి హాజరయ్యారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమకు అన్యాయం జరుగుతుందని సమావేశంలో విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ కమిటీలు, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల ఏర్పాట్లపై ఆయా గ్రామాలకు చెందిన కొందరు పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కాంగ్రెస్పార్టీ కార్యకర్తలకు తెలియకుండానే గుట్టుచప్పుడు కాకుండా కొందరిని నియమించుకున్నారని పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పరిశీలకుల దృష్టికి తీసుకొచ్చారు.
ముఖ్యంగా పార్టీకి అందుబాటులో ఉండడని పాపిరెడ్డిగూడ గ్రామ కమిటీ అధ్యక్షుడిని తక్షణమే తొలగించాలని మాజీ సర్పంచ్ శివయ్య, సీనియర్ నాయకులు తాండ్ర కృష్ణారెడ్డితోపాటు పార్టీ కార్యకర్తలు పరిశీలకుల దృష్టికి తీసుకొచ్చారు. మండల పార్టీ అధ్యక్షులు గూడ వీరేశం సైతం పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కార్యకర్తలకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని పరిశీలకుల ముందు మండిపడ్డాడు. పలు గ్రామాల కార్యకర్తలు సైతం తమను మండలస్థాయి నాయకులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఏది ఏమైనా పార్టీ శిక్షణ కార్యక్రమం రసాబసగా ముగిసిందని చెప్పవచ్చు.