పరిగి, జూలై 31 : మండలంలోని రంగాపూర్ నుంచి టీపీసీసీ ఆధ్వర్యం లో గురువారం చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర వాహనదారులకు చుక్కలు చూపించింది. ఈ సందర్భంగా వాహనదారులు సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాదయాత్ర ప్రారంభం కంటే ముందుగానే పోలీసులు టెలిఫోన్ ఎక్సేంజ్ వద్ద హైదరాబాద్‌కు వెళ్లే రహదారిని ఒకవైపు పూర్తిగా మూసేసి వాహనాలను నస్కల్ మీదుగా మళ్లించారు.
పాదయాత్ర ప్రారంభం కాగానే పరిగి నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నీ నిలిచిపోయాయి. పాదయాత్ర పట్టణంలోకి వచ్చిన తర్వాత కొడంగల్ క్రాస్‌రోడ్డులో సమావేశం పూర్తయ్యేవరకు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయి వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ట్రాఫిక్‌లో నిలిచిపోయిన వాహనాలు..
కాంగ్రెస్ అగ్రనేతలు తమ ప్రాంతానికి రావడంతో సమస్యలు చెప్పుకొందామని వచ్చిన వారికి పోలీసులు చుక్కలు చూపించారు. ఎక్కడికక్కడ అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు. స్థానికులను కలవకుండా, మాట్లాడకుండా యాత్రను పూర్తి చేయడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.