కుత్బుల్లాపూర్,ఫిబ్రవ21: గడిచిన ఆరేండ్లుగా ప్రేమించుకున్న ఒక జంట బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపుతుంది. ప్రేమ వివాహం విఫలమైందన్న బెంగతో యువతి, ఆమె మరణానికి తనే కారణమనే ఆరోపణలతో యువకుడు బలవన్మరణానికి పాల్పడటం విషాదంగా మారింది.
యువతి ఆత్మహత్యతో…
ఈ నెల 17న జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో పావని అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె గడిచిన ఆరు ఏండ్లుగా శ్యామ్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరి ప్రేమవివాహం విఫలం కావడంతో మనస్తాపానికి గురైన పావని ఈనెల 17న బలవన్మరణానికి పాల్పడింది. తమ కుమార్తే బలవన్మరణానికి శ్యామే కారణమంటూ మృతురాలి కుటుంబసభ్యులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భీమిలిలోని లాడ్జిలో శ్యామ్ ..
పావని బలవన్మరణానికి పాల్పడిన రోజు నుంచి పరారీలో ఉన్న శ్యామ్ శనివారం ఏపీలోని భీమిలిలో ఉన్న ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇక్కడి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో గానీ, పావని బలవన్మరణంతో పశ్చాత్తాపంతోగానీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.
గతంలోనే పోలీస్స్టేషన్ మెట్లెక్కిన ఇరు కుటుంబాలు…
పావని,శ్యామ్ల ప్రేమవ్యవహారం ఇరుకుటుంబాలకు ముందునుండే తెలుసునని, గతంలో వీరిద్దరి ప్రేమ, పెండ్లి విషయమై ఇరుకుటుంబాల మధ్యన విభేదాలు ఉండటంతో వారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలుస్తుంది. అప్పట్లోనే పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోడంతో ఈ దారుణం చోటు చేసుకున్నదని సమాచారం.ఈ కేసు విషయంలో జీడిమెట్ల,భీమిలి పోలీసులు సమన్వయంతో దర్యాప్తు చేస్తున్నారు.