హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునరుద్ధరణకు సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (ఎన్ఏటీఎం) సాంకేతికతను వినియోగించుకోవాల ని కసరత్తు చేస్తున్నది. ఆ దిశగా టన్నెల్ నిపుణులు, ఇంజినీర్లతో సంప్రదింపులు కొనసాగిస్తున్నది. సొరంగ మార్గంలో షీయర్ జోన్లు (వదులైన రాతిపొరలు), భారీ నీటి ఊట ప్రాంతాలు ఉండటం, ప్రమాదం సంభవించడం, పనులు నిలిచిపోవడం తెలిసిందే. మున్ముందు కూడా అదే తరహా షియర్ జోన్లు ఉ న్నట్టు ఇప్పటికే గుర్తించారు.
అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో పనుల నిర్వహణ సవాల్‌గా నిలిచింది. ప్రమాదంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) పూర్తిగా ధ్వంసం కావడం, ఇక ఆ టెక్నాలజీతో పనులు కొనసాగించలేమని నిపుణులు సైతం తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పనులను డీబీఎం (డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్) ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే సొరంగ మార్గంలోని భౌగోళిక పరిస్థితుల రీత్యా ఎన్ఏటీఎం సాంకేతికతో పనులు చేయాలని సమాలోచనలు చేస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్టు సమాచారం.
ఎన్ఏటీఎం విధానంలోనే సొరంగం తవ్వకాన్ని చేపట్టాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సాంకేతిక ప్రత్యేకత ఏమిటంటే చుట్టపక్కల భౌతిక పరిస్థితులకు అనుగుణంగా సొరంగ మార్గాన్ని నిర్మిస్తుంది. నిర్దిష్ట ప్రాంతంలో తవ్వకం పూర్తికాగానే సొరంగం చుట్టుకొలతను స్థిరీకరించేందుకు వైర్ మెష్, రాక్ బోల్ట్‌లతో, సన్నని ప్రాథమిక లైనింగ్(షాట్ క్రీట్) ద్వారా పటిష్టం చేస్తుం ది. మారుతున్న భౌగోళిక పరిస్థితులకు అ నుగుణంగా సొరంగ నిర్మాణాన్ని పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ సాంకేతికత అత్యంత ఖర్చుతో కూడుకున్నదని అధికారులు వివరిస్తున్నారు.
అదీగాక ఒక కిలోమీటర్‌కు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లకు వరకు ఖర్చు వస్తుందని ఇంజినీర్లు తెలుపుతున్నారు. ప్రస్తుతం హిమాలయాల్లో సొరం గ నిర్మాణాల్లో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టన్నె ల్ నిర్మాణంలో అనేక సంక్లిష్టతలు, స వాళ్లు ఉన్నాయని, అందులో ఎన్ఏటీఎం సాంకేతికత వినియోగం కూడా మరో సవాల్‌గా ని లుస్తుందని ఇంజినీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైనే ప్రస్తుతం సర్కార్ చర్చలు కొనసాగుతున్నవి.