కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో ఎక్కడ భూములు కనిపించినా..ఇష్టానుసారంగా లాక్కుంటున్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్ భూములను చెరబడుతూ కొల్లగొడుతున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ శివారులోని పలుచోట్ల ఉన్న ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని నాలుగు వందల ఎకరాలను సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా మూసీ పునరుజ్జీవం పేరిట ప్రజల భూములపై కన్నేశారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ పేరిట వందల ఎకరాలను కాజేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. అందులో భాగంగానే మూసీ, ఈసా నదులు కలిసే చోటుకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల భూములను అగ్గువకు తీసుకుని కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏండ్ల తరబడిగా తమ తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఖరీదైన పట్టా భూములపై రేవంత్రెడ్డి సర్కారు కన్నేసిందని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న గాంధీ సరోవర్కు అత్యంత దూరంగా ఉన్నా.. తమ భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని మూసీ పరీవాహక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ)
విలువైన భూములపై నజర్
మూసీ, ఈసా నదులు కలిసే సంగమ ప్రాంతానికి కొద్దిదూరంలో దాదాపు 30 కుటుంబాలకు చెందిన 29 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. ఆ భూముల్లో కొద్ది రోజుల కిందట పంటలు కూడా పండించేవారు. ఆ భూములు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న గాంధీ సరోవర్కు ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నది. కానీ గాంధీ సరోవర్ ప్రాజెక్టులో కలుపుకోవాలని ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో ఆ భూములను కూడా చేర్చారు. ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని గ్రామ సభకు కూడా పిలిచారు. కానీ ఆ రైతులు మాత్రం తమ భూములను ఇవ్వబోమని తేల్చి చెబుతున్నారు.
నగరానికి నడిబొడ్డున ఉన్న ఈ భూములు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల దాకా ధర పలుకుతున్నాయి. ఇలాంటి ఖరీదైన భూములను తీసుకుని టీడీఆర్లు ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ భూములను మాత్రం వేలం వేసి వందలాది కోట్లకు విక్రయిస్తూ ఖరీదైన తమ భూములను మాత్రం అగ్గువకు తీసుకునేందుకు రేవంత్రెడ్డి సర్కారు చూస్తున్నదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైన బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. తమ భూములను లాక్కునేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Land 5
భూములు లాక్కునేందుకే..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎక్కడ భూములు కనిపించినా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా భూములను ప్రభుత్వానికి ఇవ్వం. గాంధీ సరోవర్ పేరుతో మహాత్మాగాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మేం వ్యతిరేకంగా కాదు. మూసీ, ఈసా నదుల సంగమం దగ్గర గాంధీ విగ్రహాన్ని పెడితే అక్కడి నుంచి దూరంగా ఉన్న మా భూములను ఎందుకు తీసుకుంటామంటున్నారు? కచ్చితంగా మా భూములను కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికే నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తప్పనిసరిగా మా భూములను తీసుకోవాలనుకుంటే ప్రభుత్వ భూములకు వేలం నిర్వహించినట్లే మా భూములకు కూడా ఆ విధానం ద్వారా తీసుకోవాలి.
-ఎం. కొమురయ్య, హైదర్గూడ
ఆత్మహత్యలే మాకు దిక్కు
ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం నా భూమి 3 ఎకరాల 8 గుంటలు పోతున్నది. మా తాతల కాలం నుంచి ఈ భూములను కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ధరలు పెరిగాక కాం గ్రెస్ ప్రభుత్వానికి కన్ను మా భూములపై పడింది. అధికారులు, ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు చేసినా మా భూములను వదులకోం. మా పిల్లల భవిష్యత్ కోసం ఆ భూమిని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు లాక్కుంటామంటే ఆత్మహత్యలే మాకు దిక్కు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఎక్కడ భూమి కనిపించినా సీఎం రేవంత్రెడ్డి కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గాంధీ విగ్రహం పెట్టుకోవడానికి మా భూములే కనిపిస్తున్నాయా? ప్రభుత్వ భూములు చాలా చోట్ల ఎకరాల కొద్దీ ఉన్నాయి. అక్కడ పెట్టుకోవాలి కానీ మా భూమిలో పెడతామంటే సహించం.
-శంకర్, హైదర్గూడ