వికారాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతున్నా సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లింపులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. సన్నాలు సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ.500లు ఇస్తామని హామీనిచ్చిన కాం గ్రెస్ దానిని తుంగలో తొక్కి బోనస్‌ను బోగస్‌గా మార్చివేసింది. కేవలం సేకరించిన ధాన్యానికే చెల్లింపులు పూర్తి చేస్తూ.. బోనస్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో జిల్లాలోని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో జిల్లాలో సన్నరకం వడ్ల సాగు గతేడాది నుంచి పెరిగింది. సన్నరకం వడ్లకు ప్రైవేట్ మార్కెట్లో అధిక ధర ఉన్నా బోనస్ కోసం చాలామంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ప్రభు త్వం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తుండడంపై మండిపడుతున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మే మొదటి వారంలో ప్రారంభమైనా ఇప్పటివరకు సన్నాలు పండించిన ఏ ఒక్క రైతుకూ బోనస్‌ను ప్రభుత్వం అందించలేదు. కాగా, జిల్లాలో ఈ యాసంగిలో 3,075 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం సేకరించగా రూ.1.53 కోట్ల బోనస్ బకాయిలు అన్నదాతలకు రావాల్సి ఉన్నది. మరోవైపు రైతులు బోనస్ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నా ప్రభు త్వం ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు రెండు, మూడు రోజుల్లోనే చెల్లింపులు పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా నెల రోజులు దాటినా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడంలేదు. ధాన్యాన్ని సేకరించిన వెంటనే బిల్లులు చేయాల్సిన కొనుగోలు కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోపాటు ప్రభుత్వం డబ్బులను సమయానికి రిలీజ్ చేయలేకపోవడంతో రైతులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నది. జిల్లాలో ఇప్పటివరకు 13,965 మంది రైతుల నుంచి 77,694 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని (రూ.185.58 కోట్ల్లు) సేకరించగా, రూ.49 కోట్ల చెల్లింపులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి రూ. 136.84 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి.
పెండింగ్ డబ్బులపై వెంటనే అధికారులు స్పందించి త్వరగా అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు తరుగు పేరిట కిలోల కొద్ది ధాన్యాన్ని కొట్టేయడం, కొనుగోలు కేంద్రాల్లో అనేక కొర్రీలు పెడుతుండడంతో అన్నదాతలు ఆ బాధలు భరించలేక తక్కువ ధర వచ్చినా సరే అనుకుని దళారులకు విక్రయించి నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అక్కడి సిబ్బంది తరుగు పేరిట రైతులను నట్టేట ముంచుతున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
40 కిలోల బస్తాలో 5 కిలోల వరకు తరుగు తీస్తున్నట్టు పేర్కొంటున్నారు. కాగా, జిల్లాలో యాసంగిలో లక్ష ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 1.10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. వానకాలం ప్రారంభమై వానలు కురుస్తుండడంతో ధాన్యం తడుస్తున్నా సంబంధిత శాఖ అధికారులు కొనుగోళ్లలో వేగం పెంచకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.