పరిగి, సెప్టెంబర్ 29 : అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలైన పట్టణాల్లో కూరగాయలు, మాంసం, కోడి, చేపలు తదితర వాటిని ఒకే దగ్గర విక్రయించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. పరిగి పట్టణంలో చేపట్టిన పనులు నిధుల్లేక అర్ధాంతరంగా నిలిచిపోయాయి. భవనాన్ని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో 48 షాపులు వచ్చేలా ఇంజినీర్లు డిజైన్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.రెండు కోట్లు విడుదల చేయగా.. ఆ మొత్తంలో జీఎస్టీ, ఇతర ఖర్చులు పోనూ సుమారు రూ.కోటిన్నరతో పనులు జరగాల్సి ఉండగా రూ.కోటీ30లక్షలతో పిల్లర్లు, బేస్మెంట్, గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి అంతస్తుల స్లాబ్ తదితర పనులు జరిగినట్లు సమాచారం. నిధుల లేమితో మిగిలిన పనులు నిలిచిపోయాయని స్థానికులు పేర్కొంటున్నారు.
అదనపు నిధులకు ప్రతిపాదనలు
సమీకృత మార్కెట్ నిర్మాణానికి అదనంగా సుమారు రూ.కోటీ70లక్షల వరకు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి అదనపు నిధులను మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వానికి పంపించినట్లు సమాచారం. సమీకృత మార్కెట్ నిర్మాణంలో భాగంగా 48 షాపులకు గోడలు, షట్టర్లు, కరెంటు, ఫ్లోరింగ్, వరండాలో టైల్స్ తదితర పనులను చేపట్టాల్సి ఉన్నది. ప్రభుత్వ అధికారులు స్పందించి పనులు త్వరగా జరిగేలా చూ డాలని స్థానికులు కోరుతున్నారు. ఇదిలావుండగా బేస్మెంట్ వద్ద పగుళ్లు వచ్చా యని.. అధికారులు నాణ్యతతో జరిగేలా పర్యవేక్షించాలని సూచిస్తున్నారు.
నడి రోడ్డుపైనే విక్రయాలు
సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో కూరగాయలు, పండ్లు, చేపలు తదితర వాటిని వ్యాపారులు ఎండలో కూర్చునే విక్రయిస్తున్నారు. పరిగి పట్టణంలో శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు కూరగాయల విక్రయాలు జరుగుతుంటాయి. శుక్రవారం ప్రస్తుతం సమీకృత మార్కెట్ నిర్మాణం జరుగుతున్న దగ్గర, ప్రధాన రహదారిపై, గంజ్‌రోడ్డులో, శనివారం ప్రధాన రహదారితోపాటు మార్కెట్ యార్డులో కూరగాయలను విక్రయిస్తుంటారు. ఎండకు, వానకు ఇబ్బందులు పడుతూ కూరగాయలను విక్రయించాల్సి వస్తున్నదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా సమీకృత మార్కెట్ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.