Auto Drivers Union | ఉప్పల్, ఫిబ్రవరి 15: ఆటో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఉప్పల్ వద్ద రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీహెచ్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలవుతున్న ఆటో కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పైన అనేకమార్లు దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. అనేకమార్లు మెమోరాండాలు సమర్పించినా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.12 వేలు ఇస్తానని ఇవ్వలేదన్నారు. రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదని, అక్రమంగా ఓలా, ఉబర్, రాపిడో కంపెనీలు, టూవీలర్ బైక్లకు అనుమతి ఇచ్చి ఆటో కార్మికులను నష్ట పరుస్తుందని సీహెచ్ శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కావున వాటిని వెంటనే నిషేధించాలని, నగరంలో మూసివేసిన పర్మిట్లను వెంటనే అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పోలే నిరంజన్, రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.