Lok Sabha : లోక్‌సభ (Lok Sabha) లో గందరగోళం ఇవాళ కూడా కొనసాగింది. రాజ్యసభ (Rajya Sabha) లో గురువారం ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ చేసిన విమర్శలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. లోక్‌సభలో తమ నాయకుడికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. పలువురు సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ (Speaker) నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.
లోక్‌సభలో ఈ బడ్జెట్ సెషన్లో ఇప్పటికే 19 గంటల 13 నిమిషాల సమయం వృథా అయ్యిందని స్పీకర్ తెలిపారు. సభను సోమవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా పార్లమెంట్లో తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13తో ముగియనున్నాయి. మార్చి 9న రెండో విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ జరుగనుంది.