పరిగి, అక్టోబర్ 26 : కూరగాయలు, మాంసం, కోడి, చేపలు తదితర వాటిని ఒకే చోట విక్రయించేలా చక్కటి ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత మార్కెట్ల నిర్మాణానికి సంకల్పించగా.. దానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడిచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, కాంగ్రెస్ సర్కారు అదనపు నిధులు మంజూరు చేయకపోవడంతో పరిగిలో అర్ధాంతరంగా నిర్మాణ పనులు ఆగిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిగిలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి రూ.2.90 కోట్ల అంచనా వ్యయంతో అప్పటి మంత్రి సబితారెడ్డి 2022 జూన్ 18న శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా మొదట రూ.2కోట్లతో నిర్మాణానికి సంబంధించి పాత మార్కెట్ స్థలంలో పనులు ప్రారంభించారు.
ఈ నిధులతో గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో 48 దుకాణాలు ఏర్పాటు చేసేలా నిర్ణయించి నిర్మాణ పనులు కొనసాగించారు. రూ.2కోట్లలో జీఎస్టీ, ఇతర ఖర్చులు పోను సుమారు కోటిన్నర రూపాయలతో పనులు జరగాల్సి ఉండగా.. కోటీ30లక్షల వరకు పనులు జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. చేపట్టిన పనులకు సంబంధించి అధిక శాతం బిల్లులు సైతం వచ్చినట్లు సమాచారం. పిల్లర్లు, బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తుల స్లాబ్‌ల నిర్మాణాన్ని చేపట్టారు. వాటి నిర్మాణానికే సుమారు కోటీ30లక్షల వరకు ఖర్చు చేయబడి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
అదనపు నిధుల మంజూరు ఎప్పుడు?
సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుందని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పనులు పూర్తి చేసేందుకు అదనంగా సుమారు కోటీ70లక్షల వరకు అవసరమవుతాయని సంబంధిత పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు అంచనా వేయడం జరిగింది. ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసి అదనపు నిధులు మంజూరు చేయాల్సిందిగా సర్కారుకు పంపించినట్లు తెలిసింది. సమీకృత మార్కెట్ నిర్మాణంలో భాగంగా 48 దుకాణాలకు గోడలు నిర్మించి, షట్టర్ల ఏర్పాటు, కరెంటు, ఫ్లోరింగ్ పనులు చేపట్టడంతోపాటు వరండాలో సైతం టైల్స్, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు పూర్తి చేయిద్దామనే ధ్యాస లేకపోవడం విడ్డూరం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తిచేయడంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మే 22న సమీకృత మార్కెట్‌ను కలెక్టర్ ప్రతీక్‌జైన్ స్వయంగా పరిశీలించి అర్ధాంతరంగా నిలిచిపోయిన మార్కెట్ పనులను పూర్తి చేయాల్సిందిగా పరిగి మార్కెట్ చైర్మన్‌కు సూచించారు. కలెక్టర్ సందర్శించి ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు చిన్న పని సైతం ప్రారంభం కాకపోవడం గమనార్హం. నిర్మాణ పనుల్లో భాగంగా చేపట్టిన బేస్మెంట్ వద్ద పగుళ్లు రావడం జరిగింది. నాణ్యతతో పనులు చేపడితే ఈ ఇబ్బంది ఉండదని, అధికారులు ఇప్పటికైనా పనులు నాణ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. సర్కారు స్పందించి అర్ధాంతరంగా నిలిచిపోయిన సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయించాలని కూరగాయల విక్రేతలు, వినియోగదారులు కోరుతున్నారు. తద్వారా కూరగాయలు, మాంసం, చేపలు, చికెన్ ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులో ఉంటాయని పేర్కొంటున్నారు.
ఎండలో రోడ్డుపై విక్రయాలు
సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తికాకపోవడంతో కూరగాయలు, పండ్లు, చేపల విక్రేతలు ఎండలో కూర్చొని అమ్ముతున్నారు. పరిగిలో శుక్రవారం, శనివారం రెండు రోజులు కూరగాయల విక్రయాలు జరుగుతాయి. గంజ్ రోడ్డు, మార్కెట్ యార్డులలో కూరగాయలు, ఇతర విక్రయాలు చేపడుతున్నారు. ఎండాకాలంలో ఎండకు, వర్షాకాలంలో వర్షానికి ఇబ్బందులు పడుతూ కూరగాయల విక్రయాలు చేపడుతుండటం గమనార్హం. మిగతా రోజుల్లో మార్కెట్ యార్డులోని షెడ్డులో కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. వినియోగదారులకు ఒకే దగ్గర అన్ని రకాల కూరగాయలు, మాంసం, కోడిమాంసం, చేపలు లభించే అవకాశం కలుగుతుంది.
పట్టించుకోని కాంగ్రెస్ సర్కారు
సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేసే అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో పరిగిలో కూరగాయలు, మాంసం, చికెన్, చేపలు తదితరాలు అన్నీ ఒకే చోట లభించేలా సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. నిధులున్నంత వరకు ఖర్చు చేసి పనులు చేపట్టగా, సమీకృత మార్కెట్‌ను పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడంలేదు. తద్వారా రెండేళ్లుగా సమీకృత మార్కెట్ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. కూరగాయల విక్రేతలు ఎండలో కూర్చొని అమ్మకాలు జరుపుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తి చేయడంపై దృష్టిపెట్టాలి.
– ఎ.సురేందర్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, పరిగి